ఎలిగేడు: భూగర్భ జలాల పెంపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఏపీడి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రాంజీ పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. డీఆర్‌పీ అనిల్, ఏపీవో సదానందం, ఎంపీడీవో భాస్కరరావు, ఏపీఎం గీత, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఆర్‌వోబీ, ఫ్లైఓవర్ బ్రిడ్జి
నిర్మాణాలకు సహకరించాలి
ఓదెల: రైల్వేశాఖ మంజూరు చేసిన ఆర్‌వోబీ, ఫ్లైఓవర్‌బ్రిడ్జి నిర్మాణాలకు భూనిర్వాసితులు సహకరించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య కోరారు. మండలంలోని శానగొండలో గురువారం సర్పంచు జీల రాజు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. శానగొండ–గొల్లపల్లి గ్రామం వద్ద మంజూరైన ఫ్లైఓవర్‌బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు స్థల సేకరణ గురించి గ్రామసభ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం ఉన్న భూముల రేట్లకు అనుకూలంగా రేట్లు నిర్ణయించి తమకు న్యాయం చేయాలని పలువురు ఆర్డీవోకు విన్నవించారు. తహసీల్దార్ వనజనాయక్, మాజీ ఎంపీటీసీ జీల తిరుపతి పాల్గొన్నారు.
హమాలీలు సిండికేట్ ఎత్తివేస్తేనే రేట్లు పెంచుతాం
గోదావరిఖని: హమాలీలు సిండికేట్ ఎత్తివేస్తేనే రేట్లు పెంచుతామని హోల్‌సేల్ వ్యాపారులు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హమాలీల సిండికేట్ విధానం మూలంగా హోల్‌సేల్ వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిండికేట్ విధానంతో 30 గంపలు మోసినా, 3గంపలు మోసినా అదే చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్కెట్‌లో హమాలీల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, హమాలీలు సిండికేట్ ఎత్తివేస్తే తప్ప రేట్లు పెంచే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో హోల్‌సేల్ వ్యాపారుల సంఘం నాయకులు పారుపల్లి సదానందం, కుసుమ రవి, నల్ల రవీందర్, జక్కుల లక్ష్మణ్, రవికుమార్, రాజు పాల్గొన్నారు.


