పెద్దపల్లి: ఆస్పత్రులు, పీహెచ్‌సీల నుంచి రక్తనమూనాలు సేకరించి టీ హబ్‌కు తరలించే వాహనాలు మంగళవారం నుంచి నిలిచిపోయాయి. ఏడు నెలలుగా వాహన అద్దె చెల్లించకపోవడంతో యజమానులు సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ వైద్యసేవలపై ఆధారపడే పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ రక్తం, మూత్రం, తెమడ తదితర నమూనాలు సేకరించి టీ హబ్‌కు తరలించే బాధ్యతను 4 వాహనాలు నిర్వహిస్తున్నాయి. వీటిఆధారంగా 56 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను సంబంధిత వైద్యులకు, పేషెంట్లకు అందజేస్తారు. ప్రస్తుతం వాహన సేవలు నిలిచిపోవడంతో పరీక్షల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.
రోజూ 800 నుంచి 2,500
నమూనాల రవాణా
జిల్లాలోని 17 ప్రాథమిక, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాట, గోదావరిఖనిలో రెండు, పెద్దపల్లిలో రెండు బస్తీ దవాఖానాల నుంచి రోజూ రక్తనమూనాలు సేకరించి టీ హబ్‌కు పంపిస్తారు. సగటున 800 నుంచి 2,500 వరకు నమూనాలు సేకరించి వాహనాల ద్వారా చేరవేస్తున్నారు. అక్కడ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో 56 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల ఫలితాలు ఆన్‌లైన్ ద్వారా వైద్యులకు అందుబాటులోకి రావడంతో వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నారు.
ఏడు నెలలుగా బకాయి
ప్రతీవాహనానికి నెలకు రూ.33 వేల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. 7 నెలలుగా చెల్లింపులు లేవని వాహన యజమానులు తెలిపారు. వాహనాల నిర్వహణ, డ్రైవర్ల వేతనాలు, ఇంధన ఖర్చులు భరించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సేవలు నిలిపివేస్తున్నట్లు టీ హబ్ మేనేజర్ శ్రీవాణికి వినతిపత్రం అందజేశారు.
సీజనల్ వ్యాధుల సమయంలో ఆందోళన
జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, జలుబు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రక్తపరీక్షలు కీలకంగా మారాయి. వాహనాల సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు సకాలంలో పరీక్షలు, ఫలితాలు రాక ఇబ్బందులు తలెత్త అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.


