సాగు విస్తీర్ణం తగ్గినా..
పెద్దపల్లి: వానాకాలం సీజన్ ప్రారంభమైంది కానీ, ఆశించిన వానలు కురవడంలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి సాగు విస్తీర్ణం పడిపోతోంది. మొన్నకురిసిన మోస్తరు వర్షాలతో కొందరు రైతులు పత్తి విత్తనాలు చల్లారు. మరికొందరు వరినారు పోశారు. వీటికి అవసరమైన యూరియా, డీఏపీ కొనుగోలు చేసేందుకు ఫెర్టిలైజర్ షాపుల బాటపడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డీలర్లు డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే రూ.1,900కు పెంచి విక్రయిస్తున్నారు. అంతేకాదు.. డీఏపీ కావాలంటే తప్పనిసరిగా అమ్మో నియా లేదా ఇతర ఎరువులు కూడా కొనుగోలు చేయాలని షరతులు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అవసరం లేనివాటిని కూడా కొనాల్సి రావడంతో తమపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 మంది ఎరువుల డీలర్లు ఉండగా అందులో 220 మంది అత్యధికంగా విక్రయాలు సాగిస్తున్నారని అధికారులు చెప్పారు. సాగు విస్తీర్ణం తగ్గినా కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎరువుల విక్రయాలపై డీలర్ల తీరు
అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు


