రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ పరిధిలోని రచ్చగుట్ట మట్టి తరలింపుపై పంచాయతీ పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే పెద్దంపేట బైపాస్ రోడ్డు విస్తరణకు స్థానిక కాంట్రాక్టర్ మట్టిని తరలించినప్పటికీ తమ గ్రామాభివృద్ధి రహదారి కావడంతో పాటు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సైతం తమ గ్రామానికి బైపాస్ రోడ్డు నిర్మాణావసరాలకు మాత్రమేనంటూ సర్ది చెప్పడం, అప్పటికే పనులు చివరి దశకు చేరడంతో గ్రామస్తులు ఉదాసీనంగా వ్యవహరించారు. పెద్దంపేట రైల్వేస్టేషన్ నుంచి గోదావరినది వంతెన వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరం రైల్వే ట్రాక్ విస్తరణకు రచ్చగుట్ట నుంచి భారీ పరిమాణంతో మట్టి తరలించుకునేందుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి అనుమతులు పొందారు. కాగా, మట్టి తరలించుకునేందుకు రెవెన్యూ, మైనింగ్ శాఖలు అనుమతులు మంజూరు చేయడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కనీసం పంచాయతీ పాలకవర్గానికి రైల్వేశాఖ విన్నవించుకోకపోవడం, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సైతం సమాచారమివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ గ్రామ సంపదగా భావించే రచ్చగుట్ట మట్టి తరలింపుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ను కలిసి మట్టి తరలింపు అనుమతులు రద్దు చేయాలని పాలకవర్గం కోరింది.
ఆధిపత్యం కోసం ఎత్తుగడలు
గ్రామ సంపదగా భావించే రచ్చగుట్టను తవ్వి మట్టిని తరలించుకోవడానికి రైల్వేశాఖ అనుమతులు పొందడంపై గ్రామస్తుల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. సుమారు ఆరెకరాల విస్తీర్ణంలో ఉండే రచ్చగుట్టకు చుట్టు పక్కల పట్టా భూములు ఉండగా, కనీసం పట్టాదారులకు సైతం సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఏకంగా మట్టిని తవ్వేందుకు రైల్వేశాఖ భారీ యంత్రాలను మొహరించిన క్షణంలోనే గ్రామ పాలకవర్గం, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు చుట్టుముట్టి మట్టి తరలింపును అడ్డుకున్నారు. మట్టి తరలింపును వ్యతిరేకిస్తూ అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, గ్రామస్తులు ఎవరికి వారే రాజకీయ ఆధిపత్యం కాపాడుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే పార్టీలకతీతంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమించేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, మట్టి తరలింపు విషయమై మైనింగ్ అధికారిని వివరణ కోరేందుకు పలుమార్లు సంప్రదించగా స్పందించలేదు. ఇదే విషయమై రైల్వేశాఖ కాంట్రాక్టర్ ప్రతినిధిని వివరణ కోరగా, మట్టి తరలింపుపై తమకు అన్ని రకాల అనుమతులు పొందినట్లు స్పష్టం చేశారు.
గ్రామ సంపదను పరిరక్షించుకోవడమే పార్టీల లక్ష్యం
ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు
మట్టి తరలింపు నిలిపివేతకు కలెక్టర్‌ను కలిసిన పాలకవర్గం
కోర్టును ఆశ్రయించాం
గ్రామ సంపదగా భావించే రచ్చగుట్ట నుంచి మట్టి తరలింపును నిలిపివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. నెల క్రితం గ్రామ పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి మట్టి తరలింపును అడ్డుకోవాలని నిర్ణయిస్తూ గ్రామంలో కూడా చాటింపు వేయించాం. పాలకవర్గానికి సమాచారం లేకుండా సంబంధిత అధికారులు అనుమతులు జారీ చేయడం శోచనీయం.
– ఆముల శ్రీనివాస్, సర్పంచ్, పెద్దంపేట


