పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం స్కీంలకు గండికొట్టి స్కాంలను ప్రోత్సహిస్తోందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసేలా ఉందన్నారు. రెండున్నరేళ్ల తన పాలనలో రూ.3.47 లక్షల కోట్ల అప్పు చేశామని గర్వంగా చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వాటితో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు, పేల్చివేతలు అని ఆయన విమర్శించారు. భట్టి విక్రమార్క ప్రసంగం పచ్చి అబద్దాలు, మోసాలతో కూడినదని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపితే.. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనే తిరోగమనంలోకి నెట్టివేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్‌రావు, నారదాసు మారుతి, పూదరి చంద్రశేఖర్, కేధం కిశోర్, అఫ్జల్ బాబా, ప్రేమ్‌కుమార్, గాజుల అరుణ్, నేరటి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మేడి సదానందం, దాసరి బాలరాజు, కుమార్ నాయక్, మేకల కొమురయ్య, కుమార్ యాదవ్, బోన్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
స్కాంలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం


