ఒత్తిళ్లకు తలొగ్గి సెమికండక్టర్ పరిశ్రమ మళ్లింపు
గోదావరిఖని(రామగుండం): రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్రానికి రావాల్సిన సెమికండక్టర్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. మంచి ఆదాయం ఉన్న రాష్టాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని వివరించారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలని పార్లమెంట్‌లో ప్రసవించానని వెల్లడించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, పేదల కోసం కాకుండా అధాని, అంబానీల కోసం పని చేస్తుందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో పూర్తిస్థాయిలో యూరియా ఉత్పత్తి జరగక రైతులు ఇబ్బందులకు గురయ్యారని, ఇప్పటికై నా రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని పేర్కొన్నారు. రైలు, బస్సు, ఫ్‌లైట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఈక్రమంలో పాలకుర్తిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రామగుండం కార్పొరేషన్ బీగ్రేడ్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరినట్లు వివరించారు. నాయకులు మల్లికార్జున్, బాబర్‌సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ


