యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ
మంథని: ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.. ప్రమాదాల నియంత్రణకు పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వాహనదారులెవరూ పట్టించుకోవడం లేదు. వాహనదారుల రక్షణ, సౌకర్యం కోసం అధికారులు అత్యాధునిక పద్ధతుల్లో సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు పటిష్టంగా అమలవుతున్నాయి. కానీ, మంథనిలో అందుకు భిన్నంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వాహనదారులు జంప్ చేస్తున్నారు. మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో ఇటీవల కొత్తగా సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. వాటిని ఎవరూ పట్టించుకునన్న పాపానపోవడంలేదు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంలో మరికొందరు, తమకు అడ్డెరంటూ ఇంకొందరు దర్జాగా సిగ్నల్స్ జంప్‌చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు.
మూడు నెలల క్రితం ఏర్పాటు
పెద్దపల్లి – కాటారం – గోదావరిఖని మధ్య ప్రధాన రహదారులపై సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో రూ.6.71 కోట్లతో ఆగస్టు 2న ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. మంథని పురపాలక సంఘం పరిధిలోని పోచమ్మవాడ ఎక్స్‌రోడ్డు వరకు, కాటారం రోడ్డులో శ్రీరాంనగర్ నుంచి మాతాశిశు ఆస్పత్రి వరకు సెంట్రల్ లైటింగ్‌తోపాటు పోచమ్మవాడ నుంచి గోదావరిఖని క్రాస్‌రోడ్డు, లైన్‌గడ్డ, కూచిరాజ్‌పల్లితోపాటు ఇతర ప్రధాన కూడలిలో హైమాస్ట్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఇదేక్రమంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు శ్రీకారం చుట్టారు. మరుసటిరోజు నుంచే ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయినా, వాటిని వాహనదారులు పట్టించుకోవడం లేదు.
జరిమానా విధిస్తే సరి..
సింగల్స్ జంప్ చేసిన వాహనదారుల మొబైల్ ఫోన్లకు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు జరిమానా మెసేజ్ పంపిస్తున్నారు. మంథనిలో పోలీసులు అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, తాము ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల రాకపోకలను గమనిస్తూ జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జరిమానా విధిస్తే వాహనదారులు దర్జాగా నిబంధనలు అతిక్రమిస్తూ ఎందుకు ముందుకు వెళ్తారనే ప్రశ్నలూ తలెత్తతున్నాయి. సిగ్నల్ జంప్ చేసిన వారికి జరిమానా విధిస్తే మరొసారి నిబంధనలు అతిక్రమించరనే వాదన ఉంది.
ప్రమాదాల నియంత్రణకు..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పాతపెట్రోల్ బంక్ కూడలి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన చౌరస్తా కావడంతోనే పోలీసులు తొలుత ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నిత్యం రద్దీగానే ఉంటుంది. లారీలు, ఇతర వాహనాల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. గతంలో ఇదేప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే ప్రమాదాల నియంత్రణకు రెండువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయినా, తరచూ ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసుల పర్యవేక్షణ లేక వాహనదారులు ఇష్టారీతిలో సిగ్నల్స్ జంప్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు పాటించాలి
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నియంత్రణకు మంథని పాత పెట్రోల్ బంక్ కూడలిలో సిగ్నల్స్ ఏర్పాటు చేశాం. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి. సిగ్నల్ జంప్ చేసి వెళ్తే సీసీ కెమెరాల ఆధారంగా జరిమానా విధిస్తాం. చలి కాలం కావడంతో ఉదయం వేళ దారులను మంచు కమ్మేస్తుంది. ఈ సమయంలో ఉదయం వేళ ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
– డేగ రమేశ్, ఎస్సై, మంథని
యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ
యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ


