ముక్కిపోతున్న దొడ్డుబియ్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పౌరసరఫరా గోదాములు, రేషన్ డీలర్ల వద్ద దాదాపుగా 3వేల క్వింటాళ్ల మేర దొడ్డుబియ్యం నిల్వలున్నాయి. ఏడాది కాలంగా వాటిని వెనక్కి తీసుకోని కారణంగా బియ్యం తుట్టెలు కట్టి.. పురుగులు పట్టాయి. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని సివిల్ సప్లయి గోదాముల్లో దాదాపుగా వెయ్యి క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉండొచ్చని అంచనా. అలాగే జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 413 రేషన్ దుకాణాల్లో మరో 2వేల క్వింటాళ్ల మేర నిల్వలు ఉండొచ్చని తెలుస్తోంది.
ఈఏడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ
తెల్లరంగు రేషన్‌కార్డులున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో అప్పటికే గోదాములు, డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం అలాగే నిల్వ ఉన్నాయి. ఆ దొడ్డురకం బియ్యం ముక్కపట్టి పాడవుతున్నాయి.
రేషన్ దుకాణంలో ముక్కి తుట్టె పట్టిన దొడ్డు రకం రేషన్ బియ్యం
ఈనెలాఖరుకల్లా తరలిస్తాం
దొడ్డురకం బియ్యం నిల్వలతో ఇబ్బందులున్న మాట వాస్తవమే. తుట్టెకట్టి పురుగుపడుతున్నట్టు డీలర్లు మా దృష్టికి తెచ్చారు. వాటిని తరలించేందుకు టెండర్లు నిర్వహించాం. ఈలోగా పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచింది. ఎన్నికలు పూర్తికాగానే దొడ్డుబియ్యం తరలించేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీకాంత్‌రెడ్డి,
సివిల్‌సప్లయ్ మేనేజర్, పెద్దపల్లి
ముక్కిపోతున్న దొడ్డుబియ్యం


