
అభివృద్ధి పనులు పూర్తి చేయండి
కలెక్టర్ కోయ శ్రీహర్ష
జీజీహెచ్ ఆస్పత్రి సందర్శన
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో విద్యా, వైద్య శాఖల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిని సందర్శించి క్రిటికల్ కేర్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు, సదరన్ క్యాంప్ నిర్వహణ పనులను పరిశీలించారు. 15 రోజుల వ్యవధిలో 50 పడకల క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవో రాజు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
జ్యోతినగర్: పెండింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం 2వ డివిజన్ న్యూపీకే రామయ్యకాలనీలోని ప్రభుత్వ పాఠశాల, మేడిపల్లి సెంటర్‌లోని సాయి సేవా సమితి పాఠశాలను సందర్శించారు. న్యూపీకే రామయ్యకాలనీలోని మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల భవనంలో పెండింగ్‌లో ఉన్న కలరింగ్, ఫ్లోరింగ్ వంటి పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రం పరిశీలన
పాలకుర్తి: పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం పరిశీలించారు. సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.పాలకుర్తి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో పాలకుర్తి జెడ్పీటీసీతో పాటు పాలకుర్తి, బసంత్‌నగర్, ఈసాలతక్కళ్లపల్లి గ్రామాల ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. పకడ్భందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జెడ్పీటీసీ ఆర్‌వో జగన్‌మోహన్‌రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రామ్మోహనచారి, ఏంపీవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఏటీసీ కేంద్రాలతోనే యువతకు నైపుణ్య శిక్షణ
రామగుండం: పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లతో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగుండంలోని ఏటీసీ కేంద్రాన్ని సందర్శించి మిషనరీని పరిశీలించి శిక్షకులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఏటీసీలో శిక్షణ పొందిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా శిక్షణ అందించాలన్నారు. ఏటీసీ వైస్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌రెడ్డి తదితరులున్నారు.