
వైద్యులు, సిబ్బందికి ‘బయోమెట్రిక్’
మంథని: ఇకనుంచి ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదును బయోమెట్రిక్ పద్ధతిన నమోదు చేస్తారని, అందరూ సమయపాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. స్థానిక సామాజిక వైద్యశాల, మాతాశిశు ఆస్పత్రి, గోపాల్‌పూర్ ప్రభుత్వ పాఠశాల, గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్ల కోసం ఇటీవల నిర్మించిన షెడ్‌ను పరిశీలించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, మహిళలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. గోపాల్‌పూర్ పాఠశాల పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు. పీహెచ్‌సీలో ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్‌సీడీ స్క్రీనింగ్, ఎక్స్‌రే, టీబీ, ముక్త్ భారత్, ఆరోగ్య మహిళ తదితర అంశాలపై ఆరా తీశారు. ఓపీ సేవలు పెంచాలని ఆదేశించారు. ఎంపీడీవో శశికళ, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో పనుల ప్రగతిపై తన కార్యాలయంలో సమీక్షించారు. పెండింగ్‌లోని సంప్ పనులు పూర్తిచేయాలన్నారు. శుక్రవారం వరకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ అధికారులు చేపట్టిన రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా తాగునీటి పైప్‌లైన్ షిప్టింగ్ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సరఫరా పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో విధులకు హాజరు కావాల్సిందే..
వైద్యులూ.. పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు