
‘స్థానిక’ పోరులో మనమే గెలవాలి
● ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయండి ● కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సంగీతం శ్రీనివాస్
పెద్దపల్లిరూరల్: స్థానిక సంస్థలకు జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సంగీతం శ్రీనివాస్, అజ్మతుల్లాఖాన్ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని అన్నారు. పార్టీ కోసం పనిచేసే నాయకులను గుర్తించి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. రానున్న స్థానిక సమరంలో పోరాడి విజయం సాధించే నాయకులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని అందుకు పార్టీనేతలంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
విజ్జన్నకు మంత్రి పదవి ఇవ్వాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మంత్రిమండలిలో స్థానం కల్పించాలని నాయకులు మహేందర్, అన్నయ్యగౌడ్, ప్రేంసాగర్‌రావు తదితరులు కోరారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై న విజయరమణారావు ప్రజానాయకుడని అన్నారు. సమావేశంలో మార్కెట్‌కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, సంజీవ్‌లతో పాటు నాయకులు మల్లన్న, రామ్మూర్తి, అవినాష్, ఆరె సంతోష్, సంతోష్, సురేశ్‌గౌడ్, తిరుపతిరెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.