స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం

Jun 30 2025 3:48 AM | Updated on Jun 30 2025 3:48 AM

స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం

స్కానింగ్‌ కేంద్రాల ఇష్టారాజ్యం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో గర్భస్థశిశు నిర్ధారణ దందా యథేచ్ఛగా సాగుతోంది. చట్టాలు, నిబంధనల ప్రకారం వ్యవహరించాలనే అధికారుల సూచనలను పట్టించుకోవడంలేదు. కొందరు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

150 ఆస్పత్రులు.. 32 స్కానింగ్‌ సెంటర్లు..

జిల్లాలో దాదాపు 150 వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. 32 స్కానింగ్‌ సెంటర్లు పనిచేస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ కేంద్రాల్లో ఎన్ని పరీక్షలు చేశారు, కారణాలు ఏమిటనే వివరాలను నమోదు చేయాలి. నెలకోసారి డీఎంహెచ్‌వో కార్యాలయంలో నివేదిక అందజేయాలి. గైనకాలజిస్ట్‌లు ఉన్న ఆస్పత్రులతో పాటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేశారు. అయితే, గర్భిణుల కుటుంబీకులు కొందరు.. కడుపులోని పిండం ఆడనా, మగనా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు స్కానింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు వైద్యులు రెఫర్‌ చేయకున్నా స్కానింగ్‌ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

లింగనిర్ధారణ చట్టవిరుద్ధం

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, గర్భస్రావాలు చేసే వారిపై పీసీ పీఎన్‌డీటీ(ప్రీ కాన్సెప్షన్‌ అండ్‌ ప్రీనాటల్‌ డయాగ్నొస్టిక్స్‌ చట్టం–1994) ప్రకారం శిక్షార్హులు. ఈచట్టం ప్రకారం కనీసం మూడేళ్లజైలు, రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు.. డీఎంహెచ్‌వో అధ్యక్షతన రెడ్‌క్రాస్‌ సొసైటీ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, గైనకాలజిస్ట్‌లతో సమావేశమై లింగనిర్ధారణ వ్యతిరేక చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు.

విచ్చలవిడిగా గర్భస్రావాలు

లింగ నిర్ధారణ చేశాక ఆడపిల్ల అని తెలిస్తే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీల సాయంతో గర్భస్రావాలు చేయిస్తున్నారు. వాస్తవానికి కడుపులో శిశువు మృతి చెందడం, ఇతర సమస్య ఉన్నట్లు స్కానింగ్‌లో తేలితే అర్హులైన వైద్యుల సమక్షంలో గర్భస్రావం చేయాలి. కానీ ఆర్‌ఎంపీల సాయంతో స్కానింగ్‌ కేంద్రాల్లో ఇష్టానుసారంగా గర్భస్రావాలు చేస్తున్నారు. గర్భస్రావం చేసుకోలేని వారికి ఆర్‌ఎంపీలే గర్భవతి నెలలను బట్టి మాత్రలు ఇస్తూ నెలకు ఇంత అని వసూలు చేస్తున్నట్లు సమాచారం.

గోదావరిఖనిలో స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి (ఫైల్‌)

మెడికల్‌ ‘దందా’

ప్రైవేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన యాజమాన్యాలు మెడికల్‌ దందా సాగిస్తున్నాయి. ఆస్పత్రిలో వైద్యసేవలు పొందితే దాని అనుబంధ మెడికల్‌ షాపులోనే మందులు కొనుగోలు చేయాలనే నిబంధన అమలు చేస్తున్నారు. గర్భస్రావం మాత్రలు, సూదిమందులను ప్రిస్కిప్షన్‌ ఉంటేనే ఇవ్వాలి. కానీ, అవేమీ పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. మెడికల్‌ షాపుల వాళ్లే గర్భస్రావం మాత్రలను ఆర్‌ఎంపీలకు ఇస్తూ ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం మాత్రలు మింగి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నా.. ఇలాంటి ఘటనలను కప్పిపుచ్చుతున్నట్లు తెలిసింది.

పెద్దపల్లి మండలం భోజన్నపేటకు చెందిన వివాహిత గర్భస్రావం కోసం ఇటీవల మెడికల్‌ షాపు నుంచి తెచ్చుకున్న మాత్రలు మింగింది. తీవ్ర రక్తస్రావమై మరణించింది. అప్పటికే ముగ్గురు పిల్లలున్న ఆ యువతి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోలేదు. దీంతో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉండడంతో గర్భస్రావం కోసం ట్యాబ్లెట్లు మింగింది. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి స్కానింగ్‌ సెంటర్‌లో రికార్డులు నిర్వహించడం లేదు. ఇష్టానుసారంగా స్కానింగ్‌ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో తనిఖీల్లో వెలుగుచూసింది.

స్కానింగ్‌ కోసం వెళ్లేవారి వివరాలను రికార్డులో నమోదు చేయని కారణంగా ధర్మారంలోని ఓ స్కానింగ్‌ సెంటర్‌ను డీఎంహెచ్‌వో ఇటీవల సీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement