● ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు ● అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలు
ఈనెల 6న
మంథని మండలం బిట్టుపల్లి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన గుండపాక ఉదయ్‌కుమార్(24) మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈనెల 10న
మంథని–పెద్దపల్లి మధ్య కమాన్‌పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వచర్లకు చెందిన దొంతుల వాణి(48) మృతి చెందింది. బైక్‌ను ఇసుకలారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈనెల 15న
ఆర్‌ఎఫ్‌సీఎల్ గేట్ మూలమలుపు వద్ద వేగంగా వెళ్తున్న ట్రాలీఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని 8మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈనెల 15న
అంతర్గాం ఎంపీడీవో ఆఫీసు సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఐకేపీ ఉద్యో గి మేర్గు కుమారస్వామి మృతి చెందారు.
ఈనెల 17న
మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొని అంతర్గాం మండలం పెద్దపేటకు చెందిన సింగరేణి కార్మికుడు బండి ప్రసాద్‌గౌడ్ దుర్మరణం చెందాడు.
గోదావరిఖని: జిల్లాలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డెక్కితే గమ్యం చేరేంత వరకూ భరోసా లేకుండాపోతోంది. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, సూచికల లేమి, లెక్కకు మించి మూలమలుపులు, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. ప్రధానంగా బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు.
గతేడాది 131 మంది..
221 మందికి గాయాలు
గతేడాది జరిగిన ప్రమాదాల్లో 131 మంది మృతి చెందగా 221మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 301మంది స్వల్పగాయాల పాలయ్యారు. రాజీవ్ రహదారిపై 27 బ్లాక్ స్పాట్లను పోలీసు యంత్రాంగం గుర్తించినా.. అక్కడ ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఆ ప్రాంతాల్లోనే ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని ప్రమాదాల్లో గాయాలపాలైన వారు శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు.
యంత్రాంగం నిర్లక్ష్యం..
ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్ యంత్రాంగానికి అప్పగించారు. ఆరేళ్ల క్రితమే జిల్లాలోని బ్లాక్ స్పాట్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాల సంఖ్య అప్పట్లో అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం సూచిక బోర్డులు లేకపోవడం, బ్లాక్ స్పాట్‌లు వాహనదారులకు కనిపించకపోవడం, అతివేగంతో చాలామంది ప్రమాదాల బారినపడుతున్నారు.
భారీ వాహనదారుల నిర్లక్ష్యం..
భారీ వాహన డ్రైవర్లతో నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవర్‌లోడ్‌తోపాటు అతివేగం ప్రమాదాల కు కారణమని అంటున్నారు. భారీ వాహన డ్రైవర్ల తీరుతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నారు. రాత్రంతా వాహనం నడిపి నిద్రలేకుండా డ్రైవింగ్ చేయడంతోనే డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటున్నారని, దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు.
నియంత్రణలోకి రాక..
ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అయినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసే కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజూ ఏదోఒకచోట మద్యం తాగి వాహనం నడుపుతూ కొందరు పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. కోర్టులు కూడా భారీగా జరిమానా విధించడంతోపాటు జైలు శిక్షణ వేస్తోంది. గతేడాది 6,725 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లు పట్టుపడగా, అందులో 3,352 మందికి రూ.44.14లక్షలు జరిమానా విధించారు. అయినా, తీరుమారడం లేనేలేదు.
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు
ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు
2022 128 44 296
2023 112 64 303
2024 131 221 301
నియంత్రణకు చర్యలు
నేను గతంలో పోలీస్ కమిషనర్‌గా పనిచేసి వరంగల్‌లో చేపట్టిన అనేక సంస్కరణలో 20శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఇక్కడ కూడా అలాంటి కఠిన చర్యలు తీసుకుంటాం. బ్లాక్ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై చర్యలు తప్పవు.
– అంబర్ కిశోర్ ఝా,
పోలీస్ కమిషనర్, రామగుండం
ప్రాణాలు పోతున్నాయి..
ప్రాణాలు పోతున్నాయి..