
సిండికేట్ మాయ
గతంలో 2,020.. ప్రస్తుతం 1,189 భారీగా తగ్గిన మద్యం దరఖాస్తులు టెండరు దక్కించుకునేందుకు వ్యాపారుల సిండికేట్ వ్యూహం ప్రభుత్వ ఖజానాకు భారీగా తగ్గిన ఆదాయం
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో మద్యం దుకాణ టెండర్లపై వ్యాపారుల సిండికేట్ ఎఫెక్ట్ పడింది. ఈ మాఫి యాతో పాటు పెరిగిన ఫీజుతో గతం కన్నా దరఖాస్తులు బాగా తగ్గాయి. రాష్ట్రప్రభుత్వం మద్యం టెండరు విధానం ద్వారా 2025–27లో భాగంగా జిల్లా లో 74 వైన్స్‌షాప్‌ల కోసం టెండర్లు ఆహ్వానించింది. క్రితంసారి 2,020 దరఖాస్తులు అందగా.. ఖజానాకు రూ.40.40కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 1,189 దరఖాస్తులు అందగా, రూ.35.67 కోట్ల ఆదాయమే సమకూరింది. ఈనెల 18వ తేదీ తో దరఖాస్తులకు గడువు ముగిసింది. చివరిరోజు టెండర్లు భారీగానే వచ్చినా గతంతో పోల్చితే తగ్గాయని అధికారులు తెలిపారు. గడువు మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
వ్యాపారుల కుమ్మక్కు!
మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా తగ్గాడానికి వ్యాపారులు సిండికేట్‌గా మారడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మద్యం వ్యాపారంలో కింగ్ మేకర్లుగా ఎదిగిన కొందరు ముఠాగా ఏర్పడ్డారని, వీరే ఆసక్తి ఉన్నవారికి అప్పులు ఇచ్చి మరీ పెట్టుబడులు పెట్టిస్తున్నారని చర్చ సాగుతోంది. రూ.3 లక్షల నగదు ఇచ్చి టెండరు వేసేలా రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నారని అంటున్నారు. ఇందుకు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆసక్తి గలవారిని తమ గ్రూపుల్లో చేర్చుకున్నారని భావిస్తున్నారు. పెట్టుబడి కింగ్‌మేకర్లదే అయినా.. వారు విధించే నిబంధనలు పాటించాల్సిందే. ఎవరికి దుకాణం అప్పగించాలన్నా.. నిర్ణయం వారిదే. ఒకవేళ దుకాణం రాకపోతే పెట్టుబడి సొమ్ము వాయిదా పద్ధతుల్లో చెల్లించేలా కూడా ఒప్పందం చేసుకున్నా రు. మద్యం వ్యాపారుల మాయాజాలం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది.
జిల్లాలో 74 మద్యం దుకాణాలు..
జిల్లాలో మొత్తం 74 మద్యం దుకాణాలు ఉండగా, టెండర్ నోటిఫికేషన్ జారీచేసినప్పటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు ఆశించినట్లు పెద్దగా రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు, బతుకమ్మ, దసరా పండుగలు దాటినా దరఖాస్తులు అంతంత మాత్రంగానే అందాయి. గతంలో ఒక్కో దుకాణానికి రోజూ 50 నుంచి 100 దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించలేదు. కొద్దిరోజుల్లో ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా.. వ్యాపారులు సిండికేట్ కావడంతోనే దరఖాస్తులు పెద్దగా నమోదు కానట్లు తెలుస్తోంది.
నేతల కనుసన్నల్లోనే..
ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న వారే గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేస్తున్నారనే ప్రచా రం ఉంది. గత టెండర్లలో పోటీపడి దరఖాస్తు చేయగా ఈసారి ఒప్పందాలతో ఆ పని చేస్తున్నారు. ముందుగా అన్నీ మాట్లాడుకున్నాకే టెండర్లు దాఖ లు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల మండల, నియోజ కవర్గస్థాయి నేతలు ఎక్కువగా తమ బంధువర్గంతో దరఖాస్తులు వేయిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభు త్వ ఖజానాకు ఆశించిన ఆదాయం సమకూరకపోవడంతో అధికారులు పునరాలోచన పడ్డారని తెలిసింది.

సిండికేట్ మాయ