పాలకవర్గం.. గరంగరం! | - | Sakshi
Sakshi News home page

పాలకవర్గం.. గరంగరం!

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

పాలకవర్గం.. గరంగరం! అభివృద్ధి పనులపై వాడీవేడి చర్చ

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో వేడెక్కిన వాతావరణం దేనికెంత.. నిధులెంత? జీడిపప్పు నుంచి జలజీవన్‌ మిషన్‌ వరకు.. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల అసహనం టీటీడీకి పంపిన జీడిపప్పు వెనక్కి రావడంపై, పరువు తీశారంటూ మంత్రి సంధ్యారాణి అసంతృప్తి మంత్రి సంధ్యారాణిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర సమావేశం ప్రారంభంలోనే నిష్క్రమించిన కలెక్టర్‌

టీటీడీకి వెళ్లిన

జీడిపప్పు.. వెనక్కి

ఎందుకొచ్చింది?

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌:

దాదాపు ఐదేళ్ల తరువాత జరిగిన పార్వతీపురం ఐటీడీఏ 75వ పాలకవర్గ సమావేశం వాడీవేడిగా సాగింది. పలు అంశాల్లో అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నిధులెంత.. దేనికెంత.. ఖర్చెంత’ అన్న రీతిగానే సమావేశం సాగింది. టీటీడీకి జీడిపప్పు సరఫరా నుంచి జలజీవన్‌ మిషన్‌ పనులు, పర్యాటక అభివృద్ధి, ఐటీడీఏ నిధుల వినియోగం, పట్టాల పంపిణీ వరకు పలు అంశాలపై సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక దశలో మంత్రి సంధ్యారాణి కంటే దూకుడుగా ప్రశ్నలు సంధించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌ చంద్ర.. ‘మీరు ఉండండి.. మీకేం తెలియదు‘ అంటూ మంత్రిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రధానంగా జిల్లా అధికారులనే లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు సాగాయి. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన ఐటీడీఏ గిరిమిత్ర సమా వేశ మందిరంలో గురువారం ప్రారంభమైన సమావేశంలో పీఓ ఆర్‌.వైశాలి.. 2021 తర్వాత పాలకవర్గ భేటీ నిర్వహించుకుంటున్నట్లు ప్రకటించారు. జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి, జీసీసీ ఎండీ ఎస్‌.ఎస్‌. శోభిక, సబ్‌ కలెక్టర్‌ ఆర్చిత్‌ సచిన్‌ రహార్‌, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఉమ్మడి జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఇటీవల అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో మృతి చెందిన గిరిజన విద్యార్థి సవర అర్పిత్‌ కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం చెక్కును మంత్రి అందజేశారు. సమావేశం ప్రారంభంలోనే టూరిజం వెబ్‌సైట్‌ను మంత్రితో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా.. జిల్లా పర్యాటక అధికారిణి వాణీ శైలజ మాట్లాడుతూ.. కలెక్టర్‌ చొరవతో జిల్లా పర్యాటకరంగానికి కొత్త ఊపు వచ్చిందని చెప్పారు. ఇదే మాట.. మంత్రితో పాటు, పార్వతీపురం ఎమ్మె ల్యే విజయ్‌చంద్ర ఆగ్రహానికి గురైంది. కూటమి ప్రభుత్వం నిధులిస్తోందని.. ప్రభుత్వ సూచనలు లేకుండా ఏ ఒక్కటీ జరగదని.. తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహించారు. దీంతో బిత్తరపోవడం టూరిజం అధికారి వంతైంది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో మొత్తం 8,275 మంది రైతులకు ఈ పుస్తకాలను అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో కొమరాడ మండలం గుణానపురం రైతుకు వీటిని తొలుత అందిస్తామని చెప్పగా.. పాస్‌ పుస్తకాల పంపిణీ జరుగుతున్నట్లు తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ఇక్కడ ఏ ఒక్కరికీ ఇచ్చేది లేదని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అసహనం వ్యక్తం చేశారు. అక్కడ మొదలు సమావేశం వాడీవేడిగా సాగింది.

అధికారులను మూకుమ్మడిగా టార్గెట్‌ చేస్తున్నట్లు ఉందని అర్థమయ్యిందో, లేక.. ఎన్నికల కమిషన్‌ వీసీ అదే సమయంలో ఉండడం కారణమో గానీ.. సమావేశం ప్రారంభంలోనే కలెక్టర్‌ అక్కడ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

పల్లెపండగ 3.0, జల్‌జీవన్‌మిషన్‌ పనులను జిల్లాలో ప్రారంభించకపోవడం అంశం సమావేశంలో వేడిని పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండగ పనులు జరుగుతుంటే.. జిల్లాలో ఎందుకు చేపట్టలేదని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర ప్రశ్నించారు. రూ.150 కోట్ల మేర గత ఏడాది పనులే ఇంకా మిగిలిపోయాయని అధికారులు వివరించగా.. వాటిని ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టి, ప్రాధాన్యత, అవసరం మేరకు చేపట్టాలని మంత్రి సూచించారు. జల్‌జీవన్‌ మిషన్‌ పనులను ఎందుకు ప్రారంభించలేదని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేల దృష్టిలో ఎందుకు పెట్టలేదని మంత్రితోపాటు, ఎమ్మెల్యే విజయ్‌చంద్ర నిలదీశారు. పార్వతీపురం నియోజకవర్గంలో ‘ఎవరైనా వద్దన్నారా.. చెప్పండి’ అంటూ పదేపదే అదే మాటను అధికారులను నిలదీయడంతో మంత్రి సంధ్యారాణి జోక్యం చేసుకుని అజెండాలో ఇంకా చాలా అంశాలున్నాయని సర్దిచెప్పేందుకు ప్రయ త్నించారు. దీంతో ‘మీరు ఆగండి..’ అంటూ మంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఊగిపోయారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్‌ అంశం కూడా వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యేకు ఈఈ స్థాయి అధికారి ఫోన్‌ చేయకూడదనే నిబంధన ఎక్కడ ఉందంటూ విజయ్‌చంద్ర ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో సమ న్వయం లేకుండా వ్యవహరిస్తే మరోసారి సహించే ది లేదని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఐదేళ్లుగా పాలకవర్గ సమావేశాలు సక్రమంగా జరగ ని పరిస్థితుల్లో ఐటీడీఏ నిధులను ఏ విధంగా, ఎవ రి ప్రయోజనం కోసం ఖర్చు చేశారో పూర్తి వివరా లు వెల్లడించాలని ఎమ్మెల్యే జగదీశ్వరి డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి నిర్ణయా లు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

●జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో డ్రాపౌట్ల విషయమై చర్చ జరగ్గా.. 1,400 మంది వరకు విద్యార్థుల ఆచూకీ లేకుండా పోయిందని (అన్‌ ట్రేస్‌డ్‌) డీఈవో బ్రహ్మాజీరావు బదులిచ్చారు. ‘అన్‌ ట్రేస్‌డ్‌’ అనే పదం వాడడంపై ఎమ్మెల్యే విజ య్‌చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో 1,100 మంది వరకు విద్యార్థులు ఐటీడీఏ పరిధిలో నే ఉన్నారని సంబంధిత అధికారులు చెప్పడంతో పాఠశాలలకు రాకుండా అంతమంది పిల్లలు ఎక్కడున్నారని ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.

●రహదారులపై సమీక్షలో మంత్రి స్పందిస్తూ.. రెండున్నరేళ్లుగా తాను చెబుతున్న బాగువలస రోడ్డునే ఇప్పటివరకు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ●ఇకపై ప్రతి మూడు నెలలకోసారి పాలకవర్గ సమావేశం నిర్వహిద్దామని మంత్రి ప్రకటించారు.

శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి టీటీడీకి పంపిన జీడిపప్పు తిరస్కరణకు గురైన వ్యవహారంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ప్రశ్నించారు. జీడిపప్పులో తేమ శాతం నిర్దేశిత నిబంధనల కంటే ఎక్కువగా ఉండడంతోనే టీటీడీ అధికారులు సరుకును వెనక్కి పంపినట్లు అధికారులు వివరించారు. శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన సరుకుల విషయంలో అత్యంత భక్తిశ్రద్ధలు, నాణ్యతా ప్రమాణాలు పాటి ంచాలని.. లేదంటే తిరిగి పంపిస్తారని స్పష్టం చేశారు. సరుకులను ముందస్తుగా పరీక్షించకుండా పంపించి జిల్లా ప్రతిష్ఠకు భంగం కలిగే పరిస్థితి తీసుకురావొద్దని అధికారులను హెచ్చరించారు. జీడిపప్పు నాణ్యతనే ఆ స్థాయిలో టీటీడీ అధికారులు పరిశీలిస్తే.. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ మంత్రి ఎలా విమర్శలు చేశారన్న గుసగుసలు అధికార వర్గాల నుంచి వినిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement