● తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
● న్యాయం చేయాలని డీటీకి వినతిపత్రం అందజేత
పూసపాటిరేగ: పోలిపల్లిలో డేటా సెంటర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలిపల్లి గ్రామ రైతులు గురువారం నిరసన తెలిపారు. కనీసం గ్రామసభ కూడా నిర్వహించకపోవడాన్ని ఆక్షేపించారు. నోటిఫికేషన్‌లో ఉన్న విస్తీర్ణానికి, రికార్డు పాప్తికి వ్యత్యాసం ఉందన్నారు. డీ పట్టాలో హక్కు దారులు కాకుండా నోటిఫికేషన్‌లో వేరే వ్యక్తులు పేర్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. న్యాయపరమైన స్పష్టత వచ్చే వరకు భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ సుభాష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పోలిపల్లి రైతులు పి.రవిశంకర్, ఎ.శ్రీను, ఎస్.రాము, పి.కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.


