పార్వతీపురం: జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలనతో పాటు కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గైర్హాజరు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలను పరిశీలించడంతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. గతంలో ఓటర్ల జాబితా సవరణ, నోటీసుల విచారణ సమయంలో తొలగించబడిన, పొరపాటున పేర్లు గల్లంతైన ఓటర్ల వివరాలను బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. అర్హత కలిగిన వారు తమ ఓటుహక్కును తిరిగి పొందేందుకు అవసరమైన చర్య లు చేపడతారన్నారు. ఓటర్లు తన దరఖాస్తు లు, క్‌లైమ్‌లు, అభ్యంతరాలను ఓటరు హెల్ప్‌లైన్ యాప్ లేదా ఓటర్సు.ఈసీఐ.జీఓవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు.
పార్వతీపురం రూరల్: ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 కింద పార్వతీపురం మన్యం జిల్లాలోని వికలాంగ (పీహెచ్‌సీ) కోటా ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు జరగనుంది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (జీజీహెచ్‌ఎస్) కేంద్రంగా, శ్రీకాకుళం మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ధ్రువీకరణ ప్రక్రియ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా కేటాయించిన షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 12న సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు, 13న బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు ధ్రువీకరణ ఉంటుంది. 14న కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, 15న జియ్యమ్మవలస, వీరఘట్టం, గరుగుబిల్లి, 16వ తేదీన సీతంపేట, భామిని, పాలకొండ మండలాలకు చెందిన వారు హాజరుకావాల్సి ఉంటుంది.సంబంధిత పీహెచ్‌సీ ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ పీహెచ్‌సీ సర్టిఫికెట్లతో పాటు అవసరమైన ఇతర పత్రాలను తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలని డీఈఓ స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులకు తెలియజేసి, వారు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విధిగా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులదేనని ఆయన ఆదేశించారు.
మక్కువ: గత మూడు రోజులుగా ఏనుగుల గుంపు పనసభద్ర పంచాయతీ పరిధిలో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని ఎరస్రామంత వలస, చిమిడివలస, సాలూరు మండలం జగ్గుదొరవలస గ్రామాల సమీపంలో 8 ఏనుగులు తిరుగుతున్నాయి. మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గురువారం తెల్లవారు జామున ఎర్రసామంతవలస గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్స్ వాటిని అడ్డుకున్నారు. గ్రామ సమీపంలోని ఓ పూరిపాకను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగులు సంచరించేందుకు అనువుగా ఆయిల్ పామ్ తోటలు, ఆడారు గెడ్డ ఉన్నందున ఏనుగులు పనసభద్ర పంచాయతీ పరిధిలోనే తిష్ట వేశాయి. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయాందోళన చెందుతున్నారు. కొన్నిసార్లు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


