ఆ ట్రాక్టర్లు మనవే.. ఒగ్గేయాలమ్మా పోలీసులు
● పార్వతీపురాన్ని దున్నేద్దాం బాస్
● అధికారులపై రుబాబు..
● ప్రైవేటు ఆస్తులపై నియోజకవర్గ నేతకన్ను!
● లిటిగేషన్ సృష్టించి డబ్బుల డిమాండ్
● దారికి రాకుంటే బెదిరింపు
సాక్షిప్రతినిధి, విజయనగరం: మళ్లీ పుడతామా ఏంటి.. ఏటి చేసిన ఇప్పుడే చేసియ్యాల అంటాడు పెద్దిగాడు... ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గ అధికార పార్టీ నేత కూడా.. గెలిచీగెలవగానే ఆబగా వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. తాను చెప్పింది చెప్పినట్లు చేయాలని.. చెప్పకపోతే జిల్లాలో ఉంచేది లేదు.. జిల్లా మొత్తానికి తానే సర్వంతర్యామిని అన్నట్లుగా ‘విజయ’ట్టహాసం చేస్తూ.. రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ.. ఇలా అన్ని రంగాల ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఆఖరికి ప్రైవేట్ ఆస్తులపై కూడా కన్నేసి తన దారికి రాకపోతే వాటిని లిటిగేషన్లో పెట్టేసి వివాదాల్లోకి నెట్టేసి అందినంత దండుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులను సైతం బెదిరిస్తున్నారు. తొలిసారి గెలవగానే ఓ అర్ధరాత్రి మహిళా ఎమ్మార్వోకు ఫోన్‌చేసి తను చెప్పినట్లుగా చేయాలని ఆదేశించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు అంటే ఆయన రూపాలు ఎలా ఉందో ఇప్పటికే అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జోరులో ఏకంగా వెంకంపేటలోని ఓ ప్రైవేటు ల్యాండ్ మీదకు ఎగబడిపోయి.. అన్ని పత్రాలు ఉన్నా ఆ ల్యాండ్ యజమానిని బెదిరించి.. కొంత ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆఖరికి భంగపడడం చూసి పార్వతీపురం ప్రజలు నివ్వెరపోతున్నారు. ఒక్కసారి గెలిస్తేనే ఇలా ఉంది.. రెండోసారి గెలిపిస్తే ఇంకేముంది అనే భీతి జనంలో మొదలైంది.
మరిపివలస క్వారీ.. మామూళ్లతో సరి
సీతానగరం మండలం మరిపివలసలో కంకర క్వారీ వద్దకు వెళ్లి ఫొటోలు దిగి హడావుడి చేశారు.. ఏంటి సంగతి. ప్రజా ఆస్తులు.. వనరుల విధ్వంసం.. పర్యావరణం అంటూ పెద్దపెద్ద డైలాగులు మాట్లాడారు. వారం తరువాత నెలవారీ మామూళ్లకు బేరం సెట్ అయిపోవడంతో ఇక అవన్నీ మాఫీ అయిపోయాయి.
మున్సిపాలిటీపై పెత్తనం కుదరడం లేదే..
పట్టణాల్లో ప్రజాపాలన ముగిసిపోయి స్పెషల్ అధికారుల పాలన వచ్చింది. దీంతో పార్వతీపురానికి కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. దీంతో అక్కడ పట్టణంలో నియోజకవర్గ నేత పెత్తనం కుదరడంలేదు. కమీషన్ల కోసం ఇష్టానుసారం పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపించి పనులు మంజూరు చేయించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే, దీనికి కలెక్టర్ నిబంధనలు.. సామాజిక అవసరాలు.. ప్రాధాన్యాలు.. బడ్జెట్ వెసులుబాటు ఇవన్నీ చూసుకుని వాటిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తన ఆదాయానికి గండిపడిందన్న దుగ్ధతో అధికారయంత్రాంగంపై చిరాకుపడుతూ అధికారులు గాడిదలు కాస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు అభివృద్ధిమీద అంత ప్రేమ.. మోజు.. శ్రద్ధ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుని భారీగా నిధులు తెచ్చుకోవాలి కానీ ఇక్కడ వీధుల్లో వీరంగం చేస్తే మేమేం చేయాలి అని అధికారులు లోలోన మదనపడుతున్నారు. గతంలో మున్సిపాలిటీలో కాలువలలో చెత్త తొలగింపు పేరిట అడ్డగోలు బిల్లులతో లక్షలు కొట్టేసిన అనుభవాన్ని ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటున్నారు. మాటికి అలాగే చేద్దాం అంటే ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి.
మూసేసిన క్వారీలనూ వదల్లేదు..
తినమరిగిన బేపి.. తలుపు మూసేసినా వంటిల్లు చుట్టూ తిరిగినట్లు.. నెలవారీ ఆదాయానికి అల వాటు పడిన సదరు నేత నిడగల్లు.. మరిపోవలసల్లోని స్టోన్ క్రషర్ల వద్దకు వెళ్లి ఫొటోలతో హడావుడి చేసి మరి నాకేం లేదా అన్నారట.. ఆల్రెడీ క్వారీలు మూసేసి ఉన్నవి కనిపిస్తున్నాయి కదా.. ఇంకేం ఇస్తాం వెళ్లండి అన్నారు వాళ్లు.. సర్లే వచ్చినందుకు దారిఖర్చులు అయినా సర్దండి అని బెదిరించి కొంత దండుకుని నియోజకవర్గంలో సీసీ రోడ్ల పనులన్నీ వాళ్లకే ఇస్తున్నారు. మొత్తానికి వెనుకబడిన నియోజకవర్గాన్ని పరుగులుపెట్టిస్తున్నారో.. డబ్బుల కోసం ఈయనే గుమ్మాల వెంట తిరుగుతున్నారో కానీ ఈయనను మాత్రం జనం అసహ్యించుకుంటున్నారు. మళ్లీ గెలిపిస్తే కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఇసుక ట్రాక్టర్లు.. మైనింగ్.. గ్రావెల్ ఎక్కడ ఉన్నా మన ఎమ్మెల్యే తాలూకా సీసర బుడ్డి అక్కడికి వాలిపోవడమే.. ఒక్కో వాయికి ఇంత అని స్పాట్ కలెక్షన్‌తో వెళ్లిపోవడమే. ఇసుక ట్రాక్టర్‌ను ఎవరైనా ఎస్సై పట్టుకుంటే వెంటనే అది మనోళ్లదే.. ఒగ్గేయాలి అంటూ ఫోన్లు.. ప్రతి ఫోన్ కాల్‌కు ఒక రేటు.. ఇదే ఆయన రూటు.. నియోజకవర్గంలో మొన్నటివరకు నియోజకవర్గంలో కంకర.. గ్రావెల్ ధరలు ఒక లెక్కలో ఉండేవి.. ఇప్పుడు ఆ రేటు పెరిగింది.. ఇదేంటి అంటే ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున ఆయనకు ఇవ్వాలి కాబట్టి ఆ రేటు కూడా ఇందులోనే అంటున్నారు వ్యాపారులు.


