పార్వతీపురం: ఇటీవల ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన కె.మాధురి కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, గిరిజన ప్రాంతాల అబివృద్ధిపై దృష్టిసారించాలని అధికారులు సూచించగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ తెలిపారు.
అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల కొనసాగింపునకు డిమాండ్
● విధులకు దూరమైన 273 మంది గురుకుల టీచర్లు
పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొనసాగించేలా ఉత్తర్వులు జారీచేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం తప్పదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో గిరిజన గురుకుల పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీ పోస్టులను చేర్చడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీనివల్ల వివిధ ఐటీడీఏల పరిధిలో గత విద్యాసంవత్సరం వరకు పనిచేసిన మొత్తం 273 మంది అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. బాధితుల్లో పాడేరు ఐటీడీఏ పరిధిలో 120 మంది, రంపచోడవరం పరిధిలో 80 మంది, పార్వతీపురం పరిధిలో 47 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 26 మంది చొప్పున ఉన్నారన్నారు.
● రైతుల ఖాతాల్లో రూ.83 కోట్లు విడుదల
సాక్షి, పార్వతీపురం మన్యం: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ (2026–27) మొదటి విడత నిధులు ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ, రైతు సేవా కేంద్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి.భవానీశంకరరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన భూయజమాని రైతు కుటుంబాలు, అటవీ హక్కుల భూములను సాగు చేస్తున్న కుటుంబాలకు(ప్రస్తుత ఏడాదిలో) మొదటి విడతగా రూ.5 వేలు, పీఎం కిసాన్ 23వ విడతగా రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు చొప్పున అందనున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,22,260 మంది రైతు కుటుంబాలకు రూ.83 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని వివరించారు. పట్టాదారు పాస్ పుస్త కాన్ని తమ ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్న రైతులు అందరికీ లబ్ధి కలుగుతుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా పార్వతీపురం రూ.17.16 కోట్లు, పాలకొండ రూ.22.65 కోట్లు, కురుపాం రూ.26.82 కోట్లు, సాలూరు రూ.16.40 కోట్లు విడుదలైనట్టు పేర్కొన్నారు. గత ఏడాది మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కలిపి రూ.237.55 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
ముచ్చటగా
మూడోస్థానం
● ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా ఘనత
పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉమ్మడి ఫలితాల్లో జిల్లా ఈ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈఓ) వై. నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ప్రణాళికలు, పర్యవేక్షణతోనే ఈ మెరుగైన ఉత్తీర్ణత సాధించామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఈ విజయానికి మార్గదర్శనం చేసిన కలెక్టర్‌కు విద్యాశాఖాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది తరఫున డీఐఈఓ కృతజ్ఞతలు తెలియజేశారు.


