మిల్లర్లకు మరో గడువు..! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లకు మరో గడువు..!

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

చర్యలు తప్పవు

వీరఘట్టం: గతేడాది ఖరీఫ్‌లో జిల్లా రైతుల నుంచి ప్రభుత్వం 2,72,119 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన జిల్లాలోని 113 మిల్లులకు ఇచ్చింది. ఈ ధాన్యం మరపట్టి అందులో 67 శాతం బియ్యం మిల్లరు ప్రభుత్వానికి అప్పగించాలి.ఈ లెక్కన మిల్లర్లు 1,82,319 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాలి. ఈ బియ్యం గతనెల 31 నాటికి ఇవ్వాలని గడువు విధించారు. అయితే గడువు ముగిసినా కొంత మంది మిల్లర్లు లక్ష్యం చేరుకోలేకపోవడంతో జూన్‌ 15 వరకు సమయం ఇచ్చారు. అయినా ఇంకా 30 మంది మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారు 2 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వలేకపోవడంతో ఈనెల 30 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. తొలుత ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా మిల్లర్లు ఎందుకు బియ్యం ఇవ్వలేకపోయారో తెలుపుతూ గత నెల 31న సాక్షిలో ప్రచురితమైన ‘మిల్లర్లకు గడువు గండం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి. మిల్లర్ల వద్ద సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయా?లేదా? అని తెలుసుకునేందుకు ఇటీవల పౌర సరఫరాల శాఖ అధికారులు జంబ్లింగ్‌ విధానంలో బకాయిలు ఉన్న అన్ని మిల్లుల్లో తనిఖీలు చేశారు. అంతా సక్రమంగానే ఉందని వారు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.

రేషన్‌ బియ్యంతో సరిపెడుతున్నారా?

ఈ ఏడాది మిల్లింగ్‌లో జాప్యం జరగడం, ఎండల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పూర్తిగా డ్రై కావడంతో ప్రతి క్వింటాకు పది కిలోల ధాన్యం తరుగు వచ్చినట్లు మిల్లర్లు చెబుతున్నారు. అలాగే చాలా రోజులు ధాన్యం నిల్వ ఉండడంతో ఎలుకలు కొరికేసి పాడయ్యాయని కొందరు మిల్లర్లు అంటున్నారు. అయితే ప్రభుత్వానికి సీఎంఆర్‌ పేరిట ఇవ్వాల్సిన 67 శాతం బియ్యం సేకరించేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వారి దగ్గర ధాన్యం లేకపోవడంతో కొంత మంది మిల్లర్లు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా అవే బియ్యం మళ్లీ ప్రభుత్వానికి సీఎంఆర్‌ కింద ఇస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల మిల్లుల తనిఖీకి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే ఇందులో జరిగిన అక్రమాలు వెలుగు చూస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన 2,72,119 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లర్లుకు ఇచ్చింది. ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల బియ్యం సేకరణలో జాప్యం జరిగింది.ఇంకా 30 మంది మిల్లర్లు 2 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చాం. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ కోసం రేషన్‌ బియ్యం ఇస్తున్నట్లు రుజువైతే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాసరావు,

పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌,

పార్వతీపురం మన్యం

ధాన్యం మరపట్టి ఇచ్చేందుకు ఈనెల 30 వరకు అవకాశం

జిల్లా వ్యాప్తంగా బియ్యం ఇవ్వాల్సిన మిల్లులు:30

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం 2 వేల మెట్రిక్‌ టన్నులు

బియ్యం ఇచ్చేందుకు సరిపడా ధాన్యం నిల్వలు కరువు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement