● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరంలీగల్: వచ్చే నెల 11వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా కేసులును ఎక్కువ సంఖ్యలో పరిష్కరించి, కక్షిదారులకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు కక్షిదారులను ఉద్దేశించి గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 11వతేదీన జరగబోయే ఆదాలత్‌లో మోటార్ ప్రమాదంలో గాయపడిన వ్యకులకు, మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులకు ఆసరాగా నిలిచే ఇన్సూరెన్స్ మొత్తాలాకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్‌జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఆర్.కృష్ణ ప్రసాద్ ,ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
రామభద్రపురం: మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి వంగపండువలసలో గురువారం విద్యుత్ షాక్ తగిలి విద్యుత్ ఓ కార్మికుడు మృతి చెందాడు, ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాశల సత్యనారాయణ(42) విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.గురువారం ఆదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటి మోటార్ పనిచేయడం లేదని మరమ్మతు చేయాలని కోరింది. దీంతో సత్యనారాయణ మోటార్ మరమ్మతు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడికి ఇద్దరు భార్యలు పద్మావతి, విజయలక్ష్మి ఉండగా ఇద్దరు ఆడపిల్లలు,ఒక అబ్బాయి ఉన్నారు.మొదటి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఆర్.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
విజయనగరం టౌన్: స్థానిక ఎస్‌వీఎన్‌లో ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ఘంటసాల, ఎస్పీ బాలు పాడిన పాటలను గాయనీ, గాయకులు ఆలపించి, శ్రోతలకు వీనులవిందు చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్.భీష్మారావు, ఎస్.జోగారావు, అధ్యక్షుడు దుర్వాసుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా ఘనవ్యర్థాల నిర్వహణ
విజయనగరం అర్బన్: జిల్లాలో ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని మున్సిపల్, పంచాయతీల అధికారులను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేక ఘనవ్యర్థాల నిర్వహణ సెల్ సమావేశం గురువారం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థ నుంచి తడి, పొడి, శానిటరీ, ఇతర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన భారీ వ్యర్థ ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలు, మార్కెట్లు సొంతంగా వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిశుభ్రమైన పర్యావరణం రాజ్యాంగంలోని ఆర్టికల్–21 కింద ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్డు పేర్కొందన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ బీబీ సరిత, జిల్లా పంచాయతీ అధికారి డీబీ మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


