ఎడమకాలువ ద్వారా వృథాగా పోతున్న నీరు
వీరఘట్టం:
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీరు పంపిణీ చేసే కుడి,ఎడమకాలువల రెగ్యులేటర్లు దయనీయ స్థితికి చేరుకున్నాయి.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన కాలువల ఆధునికీకరణ పనులు 25 శాతం లోపు జరిగాయనే సాకు చూపించి చంద్రబాబు ప్రభుత్వం ఆధునికీకరణ పనులను రద్దు చేసింది. అయితే గత రెండేళ్లుగా కుడి,ఎడమ కాలువల రెగ్యులేటర్లు మరమ్మతుల బారిన పడడంతో షట్టర్లు తుప్పుపట్టి పనిచేయడం లేదు. దీంతో గతేడాది నవంబర్‌లో ఖరీఫ్ సీజన్ ముగిసినా సాగునీరు వృథాగా పోతోంది. ఈ షట్టర్లు బాగుచేసేందుకు సుమారు రూ.46 లక్షలు ఖర్చు అవుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి నివేదించారు.అయితే ప్రభుత్వం కనీసం చిల్లిగవ్వ కూడా షట్టర్లు బాగు చేసేందుకు నిధులు విదల్చలేదు. ఫలితంగా నిధుల లేమితో షట్టర్లు బాగుచేయించలేక జలవనరులశాఖ అధికారులు బేలచూపులు చూస్తున్నారు.మరో వైపు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది. సాగునీటి పంపిణీ ఎలా చేయాలిరా దేవుడా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు గుర్తించిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతిలు రైతులతో కలిసి గతంలో తోటపల్లి పాత రెగ్యులేటర్లు పరిశీలించారు. సాగునీటి పంపిణీలో తలెత్తిన ఇబ్బందులు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు..
ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని పాత కుడి,ఎడమకాలువల రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.వాస్తవానికి ఈ షట్టర్ల మరమ్మతులకు రూ.18 లక్షలతో గతేడాది అక్టోబర్‌లో అధికారులు టెండర్లు పిలిచారు.అయితే ఈ ఎవరూ టెండర్లకు ముందుకు రాలేదు.దీంతో షట్టర్లు బాగవకపోవడంతో లక్షల కూసెక్కుల నీరు వృథాగా పోతోంది.రైతులకు అవసరం వచ్చినప్పుడు నీరందించలేకపోతున్న జలవనరులశాఖ అధికారులు, రైతులకు నీటి అవసరం లేకపోయినప్పటికీ పంట పొలాల్లోకి నీరు వస్తుండడండపై రైతులు మండిపడుతున్నారు. ఇటీవల ఇదే విషయంపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెంనాయుడిని కలిసి ఈ ప్రాంత రైతుల సమస్యలను వివరించారు.ఆధునీకీకరణ పనులను రద్దు చేయడం చాలా అన్యాయమని,కనీసం పాత కాలువ రెగ్యులేటర్లు అయినా బాగు చేయించాలని మంత్రిని కోరారు.
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం
వృథాగా సాగునీరు..
గత ఆరు నెలలుగా తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాలువ ద్వారా 3.06 టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు.ఈ లెక్కన నెల రోజులకు 0.51టీఎంసీల నీరు ఆరు నెలలకు గాను 3.06 టీఎంసీల నీరు వృథాగా పోతోంది.తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా గురువారం నాటికి నీటి నిల్వ 1.723 టీఎంసీలు ఉంది.
తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నీటి నిలుపుదలచేయడం సాధ్యం కావడం లేదు.షట్టర్లు తుప్పుపట్టాయి.ఈ షట్టర్లు బాగు చేసేందుకు రూ.46 లక్షల నిధులు అవసరం ఉంది.పూర్తి వివరాలతో ఓ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం.నిధులు మంజూరైతే షట్టర్లు బాగు చేయిస్తాం. డీవీ రమణ,
కుడి, ఎడమకాలువల కార్యనిర్వహణ ఇంజినీర్


