● ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు
● రూ.90 వేల నగదు స్వాధీనం
పార్వతీపురం రూరల్: ఈ నెల 7న అడ్డూరివలస వద్ద జరిగిన చౌక బంగారం దోపిడీ కేసును పార్వతీపురం రూరల్ పోలీసులు ఛేదించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి బాధితుడిపై దాడి చేసి నగదు అపహరించిన అంతర్రాష్ట్‌రట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనీషా రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకు తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇప్పిస్తామని నమ్మించిన ఒడిశాకు చెందిన రాజు, అతని అనుచరులు ఈ నెల 7న అడ్డూరివలస వద్ద అతనిపై కర్రలతో దాడి చేసి రూ.2 లక్షల నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఒడిశా సరిహద్దుల్లో నిందితుల కోసం గాలించాయి. బుధవారం సాయంత్రం కొత్తవలస వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా దొరికిన ఒడిశాలోని కొరాపుట్ జిల్లాకు చెందిన మీనక నారాయణరావు అలియాస్ రాజు, హోబిక సన్నులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాజా దోపిడీతో పాటు జనవరిలో జరిగిన మహిమగల నాణెం మోసం, గత నెలలో బట్టల వ్యాపారిపై జరిగిన దోపిడీ కేసుల్లోనూ తామే పాల్గొన్నట్లు అంగీకరించారు. నిందితుల నుంచి తాజా కేసుకు సంబంధించిన రూ.60 వేలు, పాత కేసులకు సంబంధించిన రూ.30 వేలు కలిపి మొత్తం రూ.90 వేల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు ఒడిశా నిందితులు మీనక మహేష్, తడాంగి కాసు, తడాంగి టాస్కు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.


