● ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి ఆపస్
వినతిపత్రం
విజయనగరం అర్బన్: 2010 టెట్ నోటిఫికేషన్‌కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయించేలా ఆర్‌టీఈ చట్టంలో సవరణలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా శాఖ వినతి పత్రం సమర్పించింది. జిల్లా రెవెన్యూ అఽధికారి సీహెచ్.సత్తిబాబు ద్వారా ప్రధాన మంత్రి, కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వినతిపత్రాలను పంపినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు 2010 టెట్ నోటిఫికేషన్‌కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత (టెట్)లో ఉత్తీర్ణత సాధించాలని లేనిపక్షంలో ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగ, భద్రత, పదోన్నతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ తప్పనిసరి అర్హత నిబంధనను 2010లో టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మాత్రమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని కోరారు. డీఆర్‌ఓను కలిసిన వారిలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఇజ్జిరోతు రామునాయుడు, వీవీజే సుబ్రహ్మణ్యం, ఏజీ తాతారావు, ఎం.వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.


