మద్దతు కరువు.. దళారుల దరువు..! | - | Sakshi
Sakshi News home page

మద్దతు కరువు.. దళారుల దరువు..!

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

మద్దతు కరువు.. దళారుల దరువు..!

సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్‌/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం రూరల్‌:

గిరిజన రైతులకు కల్పవృక్షంగా నిలవాల్సిన ‘తెల్ల బంగారం’ (జీడి) ఇప్పుడు వారి కళ్లల్లో కన్నీరు మిగులుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మన్యం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో సుమారు 99 వేల ఎకరాల్లో సాగువుతున్న జీడి పంటపైనే వేలాది గిరిజన కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మార్కెట్లో గిరాకీ ఉన్నా.. ప్రభుత్వం నుంచి కొనుగోలుకు సహకారం లేకపోవడంతో రైతులు దళారుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పార్వతీపురం ఏజెన్సీలో 65 వేల ఎకరాలు, పాలకొండ ప్రాంతంలో 34 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది. హెక్టారుకు 600 కేజీల దిగుబడి వస్తున్నా, రైతుకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. పంట ఆరంభం నుంచి తెగుళ్ల బెడద వేధిస్తున్నా.. అధికారుల నుంచి కనీస సలహాలు లేవు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన గిరిజనులు.. పంటను ఇళ్లలో నిల్వ చేసుకోలేక తెచ్చిన అప్పులు తీర్చలేక దళారులు నిర్ణయించిన ధరకే తెగనమ్ముకుంటున్నారు.

మూలనపడిన ‘ప్రాసెసింగ్‌’ చక్రం..

గిరిజనులకు అండగా ఉండాల్సిన ప్రాసెసింగ్‌ యూనిట్లు పాలకుల నిర్లక్ష్యంతో మూలకు చేరాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యూనిట్లు నిరుపయోగంగా మారాయి. ఎల్విన్‌ పేటలో భవనాల పరిశీలనతోనే కాలక్షేపం చేయగా.. పార్వతీపురంలోని కేంద్రం ముడిసరకు లేక మూతపడింది. సీతంపేట మండలం జిల్లేడుపాడు, శంభాం కేంద్రాలు కూడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఫలితంగా విలువైన యంత్రాలు తుప్పు పడుతున్నాయి. గతేడాది కిలో జీడిపిక్కలకు రూ.155 వరకు ధర పలికింది. ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పెరగడంతో రూ.200 పైబడి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. జీసీసీ, ఐటీడీఏ (వీడీవీకేఎస్‌) కేంద్రాలు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో ప్రైవేటు వర్తకులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. పప్పు వేరుచేసే ప్రక్రియ సరిగ్గా లేకపోవడంతో పంట విలువ పడిపోతోందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

ముడి సరకుకూ డబ్బులు లేవాయే..

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురంలో వీడీవీకే గ్రూపు సభ్యులతో జీడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.కోటి వరకూ యూనిట్‌, ఇతర ఏర్పాట్లకు వ్యయం అయ్యింది. రోజుకు ఒక టన్ను చొప్పున.. ఏడాదికి సుమారు 300 టన్నుల వరకు ప్రాసెసింగ్‌ చేయాలని భావించారు. గత ఏడాది 48 మెట్రిక్‌ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. సుమారు రూ.75 లక్షల మేర పిక్కల కొనుగోలుకే ఖర్చు చేశారు. సరకు అయిపోయింది. ప్రాసెసింగ్‌ ఆగిపోయింది. ఇందుకు కారణం జీడిపిక్కల కొనుగోలుకు డబ్బులు లేకపోవడమే. నిధుల సేకరణ ఐటీడీఏకు భారంగా మారింది. పిక్క పచ్చిగా ఉండడం వల్ల కూడా కొనుగోలుకు ముందుకు రాలేకపోతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాల్లో రైతులకు ఎక్కడా మద్దతు దొరకడం లేదు. పార్వతీపురం వచ్చి వ్యాపారులకు విక్రయిస్తే.. కిలో రూ.145 నుంచి రూ.155 మధ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఒక ధర స్థిరంగా ఉండడం లేదు.

దిగుబడి తగ్గినా.. పెరగని ధర

కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి సాగుపైనే ఆధారపడుతుంటారు. ఏటా జీడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది. ఒకానొక సమయంలో కేజీ జీడి రూ. 200 వరకు ధర పలకగా.. ఈ ఏడాది మాత్రం కేజీ ధర రూ.145కి పడిపోయింది. దీంతో జీడిరైతు లబోదిబోమంటున్నాడు. ధర పడిపోవడానికి ముఖ్య కారణం పూర్తిస్థాయిలో జీడిలో నాణ్యత లేక పోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో జీడి పిక్కలు ఎండినవి వస్తే మార్కెట్లో డిమాండ్‌ ఉంటుందని.. పచ్చిగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో ధర తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దిగుబడి తక్కువగా ఉంటే మార్కెట్లో ధర పెరగాలి. ఇప్పుడు దిగుబడి తక్కువగా ఉన్నా.. ధర లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీడీపిక్కలను గ్రేడింగ్‌ చేస్తున్న సిబ్బంది

విలవిల్లాడుతున్న జీడి రైతులు

ప్రాసెసింగ్‌ లేదు.. ప్రోత్సాహం దొరకదు

తెల్లబంగారానికి కొరవడిన ఆదరణ

లక్షలు వెచ్చించినా మూలకే ప్రాసెసింగ్‌ యూనిట్లు

Advertisement
 
Advertisement
Advertisement