హెల్ప్‌లెస్‌ హ్యాండ్స్‌! | - | Sakshi
Sakshi News home page

హెల్ప్‌లెస్‌ హ్యాండ్స్‌!

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

హెల్ప్‌లెస్‌ హ్యాండ్స్‌!

మూణ్ణాళ్ల ముచ్చటగా ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’

రోగులకు అందని సహాయం

జిల్లా ఆసుపత్రి సిబ్బంది తీరు.. ‘తెలియదు, మర్చిపోయాం!’

సాక్షి, పార్వతీపురం మన్యం:

● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో మంగళవారం ఉదయం తేనెటీగల దాడిలో పలువురు ఉపాధి హామీ వేతనదారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి గురించి ఆరా తీసేందుకు పలువురు గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రారంభం మొదలు.. చివరి వరకు వీరి ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారే కరువయ్యారు. ఆస్పత్రి కింద భాగంలో అడిగితే.. రెండో అంతస్తుకు వెళ్లాలని! పైకి వెళ్లి అడిగితే.. కుడి వైపు వెళ్లాలని ఒకరు.. అక్కడికి వెళ్తే, ఇటు కాదు.. ఎడమ వైపు పోవాలని మరొకరు! ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బదులిచ్చారు. కనీసం అక్కడే విధుల్లో ఉన్న నర్సులు, వైద్యులు, సిబ్బందికి కూడా వీరి సమాచారం తెలియక పోవడం గమనార్హం. తమ వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఆ గ్రామస్తులకు సుమారు అరగంట సమయం పట్టింది. వీరికి వివరాలు చెప్పేందుకు ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ వలంటీర్లు ఎవరూ కనిపించలేదు.

● ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు ఎలా ఉందంటే.. తేనెటీగల దాడిలో గాయపడిన వారు 15 మందని ఒకరు.. ఆరుగురే ఉన్నారని ఇంకొకరు.. లేదు ఇద్దరే చికిత్స పొందుతున్నారని మరొకరు... ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా పొంతన లేని సమాధానాలు చెప్పడం విశేషం.

జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగులకు.. వారి బంధువులకు సరైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. వైద్యం మాట దేవుడెరుగు.. కనీస సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు. వైద్యులు, లెక్కకు మించి నర్సులు, సిబ్బంది ఉన్నా.. వైద్యం కోసం వెళ్లిన రోగులకు, వారి బంధువులకు ఏ ఒక్కరి నుంచీ స్పష్టమైన సమాధానం, సమాచారం దొరకడం లేదు. ఆస్పత్రిలో రోజుకు 300కు పైగా ఓపీ నమోదవుతుంది. నిత్యం ఇన్‌ పేషెంట్లు 100కు పైగానే ఉంటున్నారు.

వలంటీర్లు లేని హెల్పింగ్‌ హ్యాండ్స్‌..

ఇటీవల ఆస్పత్రిలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి శ్రీకారం చుట్టారు. గిరిజనులు, దూర ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆస్పత్రుల్లో సేవలు సులభతరం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఓపీ, ల్యాబ్‌, మందులు ఇచ్చే వద్ద, ఇతర ఏ సహాయం కావాలన్నా హెల్పింగ్‌ హాండ్స్‌ వలంటీర్‌ చేదోడుగా ఉంటారని కార్యక్రమం ప్రారంభం సమయంలో కలెక్టర్‌ తెలిపారు. ఆయన ఆలోచన మంచిదే అయినప్పటికీ.. ఆచరణలో మూడు రోజులు ముచ్చటగానే మిగిలిపోయింది. ఆస్పత్రిలో ఎక్కడా వలంటీర్లు కానరాని పరిస్థితి నెలకొంది. కనీసం ఆస్పత్రి సిబ్బంది అయినా మానవతా దృక్పథంతో సహాయం చేసే పరిస్థితి ఉండటం లేదని రోగుల బంధువులు అంటున్నారు. సిబ్బందిని ఎవరైనా అడిగినా.. ‘తెలియదు.. మర్చిపోయాం’ అన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. హెల్పింగ్‌ హాండ్స్‌ కాస్త.. హెల్ప్‌లెస్‌గా మారిపోయిందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement