పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలు

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు జిల్లాలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. సీతంపేట మండలం పనుకు వలసలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకోవాలని, బ్యాంకులు రుణాల మంజూరులో సహకరించాలని సూచించారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

రుణాల మంజూరులో అలసత్వం వద్దు

లబ్ధిదారులకు రుణాల మంజూరులో అలసత్వం చూపరాదని బ్యాంకు అధికారులను కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌ డేలో పెండింగ్‌ రుణాలపై సమీక్ష నిర్వహించారు. రుణ దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం, పత్రాల లోపాలు, సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో ఇంధన కొరత లేదు

జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి

పార్వతీపురం: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ సి. యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పట్టణంలోని పలు పెట్రోల్‌ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వల వివరాలను పరిశీలించారు. ఎక్కడా స్టాక్‌ కొరత లేకుండా అవసరం అయినపుడు వెంటనే ఇండెంట్‌ పెట్టి సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన నిల్వలు ఉంచాలని యాజమాన్యాలను ఆదేశించారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు.

మే 2న బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ అధ్యక్షుడి రాక

పార్వతీపురం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా మే 2న విజయనగరం రానున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన సంక్షేమ సాధికారి అధికారి ఇ.అప్పన్న మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్‌ కార్యాలయంలో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యత

సీతంపేట: బాలల హక్కుల పరిరక్షణను అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు చల్లా మధుసూదనరావు అన్నారు. ఈ మేరకు సీతంపేటలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో అంగన్‌వాడీలు, వీఆర్‌ఓలు, ప్రజలతో బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, విద్య, ఆరోగ్య సమగ్ర వికాసంపై ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ అనేది కమిషన్‌, ఐసీడీఎస్‌తోపాటు ప్రజలందరి సమష్టి బాధ్యత అన్నారు. బాల్యవివాహాలను అంతా కలిసి సమూలంగా నిర్మూలించాలని కోరారు. పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్‌లు లేకుండా ప్రతి చిన్నారిని బడికి పంపించేలా వారి తల్లిదండ్రులను చైతన్యం చేయాలంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన పాలకొండ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థులను సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement