● బారులు తీరిన వాహనాలు
● వినియోగదారులకు తప్పని అవస్థలు
● బంకుల నుంచి బ్లాక్ మార్కెట్‌కు తరలింపు
● బంకుల వద్ద పోలీసుల పహారా
పాలకొండ: పాలకొండ డివిజన్ కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ఎనిమిది పెట్రోల్ బంకులు ఉన్నా ఆయిల్ కొరత తీవ్రంగా వెంటాడుతోంది. సోమవారం రాత్రి నుంచి బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. డీజిల్ అమ్మకాలు పూర్తిగా నిలిపివేయడంతో రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర వాహనాలకు మాత్రమే ఆయిల్ అందించాలని ఆదేశాలు ఉన్నాయని బంకుల యజమానులు డీజిల్ వేయడానికి నిరాకరిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు కొన్ని బంకుల్లో అధిక ధరలకు డీజిల్ అమ్మకాలు చేపట్టారని వినియోగదారులు చెబుతున్నారు. క్యాన్‌ల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బంకుల వద్ద పహారా కాసి వాహనానికి ఒక లీటరు చొప్పున పెట్రోల్ వేయించేలా ఏర్పాట్లు చేశారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ బంకులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు ఆయిల్ పోయాలని స్పష్టం చేశారు.


