● గిరిజనులను విడిపించేందుకు ఆంధ్రాప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి?
● మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పాలి
● మాజీ డిప్యూటీ సీఎ పీడిక రాజన్నదొర
సాలూరు: వివాదాస్పద ఆంద్రా ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లోని గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదని, భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్చేచ్ఛా హక్కుకూడా వారికి లేకుండా పోయిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర వాపోయారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. జనగణనను తాము ఆంధ్రాలో చేసుకుంటామని చెప్పినందుకు ఒడిశా అధికారులు తప్పుడు కేసులు పెట్టి ఇద్దరు ఎగువశెంబి గిరిజనులను ఆంధ్రాలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారని అక్కడ గిరిజనులు, నాయకులు వాపోయారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భూభాగంలోకి ఒడిశా పోలీసులు వచ్చి ఇద్దరు గిరిజనులను అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తే మంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి ప్రైవేట్ లాయర్లు ఒడిశా వెళ్లి వారిని విడిపించడం కాదని, ఆంధ్రా ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్లి వారిని విడిపించారా? అలా ఎందుకు ఆంధ్రా ప్రభుత్వం చేయలేదని ప్రశ్నించారు. పైగా వారిని విడిపించామంటూ మీ సొంత మీడియాలో చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలకు ఏమైనా పొంతన ఉందా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రికి సూచించారు. దేశంలో, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో దశాబ్దాల కొటియా వివాదానికి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. కొఠియా సమస్యను పలుమార్లు తాను అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలపగా అప్పటి ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ను జగన్‌మోహన్ రెడ్డి కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ పాపం..ప్రజలకు శాపం
పెట్రోల్, డీజిల్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్య పాపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తగు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కేవలం ఆంధ్రా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. పక్కనున్న మిగిలిన ఏ రాష్ట్రంలోను ఈ కొరత లేదన్నారు. ఆంధ్రాలో చాలావరకు బంక్‌లు నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఇంధన కొరత ప్రభావం చివరకు పడేది ప్రజలపైనే నన్నారు. దీనివల్ల ఽ ప్రజలపై ధరల భారం పడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని మోయాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు.


