ఏజెన్సీ మిళితమై ఉన్న పాలకొండ నియోజకవర్గంలో ప్రస్తుత సీజన్లో 34వేల ఎకరాలకు పైగా జీడిసాగుపై రైతులు ఆధార పడుతున్నారు. గిరిజన ఆవాసితమైన సీతంపేట మండల పరిధిలో సుమారు 10వేల మంది వరకూ గిరిజనులు 25 వేల ఎకరాల వరకు జీడి సేద్యం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రోత్సాహం గిరిజనులకు లేదు. హెక్టారుకు 600 కేజీల మేర దిగుబడి వస్తుండడంతో సంబంధిత రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సరైన మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం.. ఆ దిశగా ఆడగులు వేయడం లేదు. దీంతో గిరిజన రైతులు దళారులు, వ్యాపారుల బారిన పడి నష్టపోతున్నారు. జీసీసీ – ఐటీడీఏ వన్ ధన్ (వీడీవీకెఎస్) వికాస్ కేంద్రాల ద్వారా కొనుగోలుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. గతేడాది కిలో జీడిపిక్కలు రూ.155 వరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది రూ.200లకు పైబడి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు లేవు. ప్రస్తుత సీజన్లో సేకరణ చేపట్టి ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా పిక్కల నుంచి పప్పును వేరుచేసి విక్రయించి, సరైన ధర అందించాల్సిన కేంద్రాలు తెరుచుకోలేదు. సీతంపేట మండల పరిధిలో జిల్లేడుపాడు శంభాం, సీతంపేటలో గల జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు మరింత చురుగ్గా పనిచేయాల్సి ఉంది.


