గతేడాది డిసెంబర్ నెలలో మంచు, ఎండ కారణంగా జీడి పూత తక్కువగా వచ్చింది. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల చాలా వరకు పూత దెబ్బతింది. ప్రకృతి సహకారం లేక ఈ ఏడాది జీడి పంట దిగుబడి తగ్గింది. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో సుమారు 2 వేల ఎకరాలు, సాలూరు మండలంలో 3,400, పాచిపెంట 600 ఎకరాలు.. మొత్తం 6 వేల ఎకరాల్లో దాదాపు 5 వేల మంది రైతులు జీడి పంటను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలుకు జీడి ప్రొసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్సు కూడా లేకపోవడంతో రైతులు మరింత దారుణంగా నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ జీడి పరిశ్రమ వారు.. పిక్కలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లాభపడడం గమనార్హం.


