● వాల్‌పోస్టర్లు, కరప్రతాల ఆవిష్కరణ
విజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవమైన మేడే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేడే ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం కొత్తదేవరవీధిలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు. మే1వ తేదీ ఉదయం 10 గంటలకు కుప్పిలి వీధిలోని పైడిరాజమ్మ సామాజిక భవనంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కామ్రేడ్ బొడ్డు వాసుదేవరావు ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రాజు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మేడే పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిప్రసాద్, సన్యాసిరాజు, అప్పారావు, సత్యారావు, గోవింద్, అచ్చన్న, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.


