నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో భగవత్ రామానుజదాస బృందం ఆధ్వర్యంలో సహస్ర శ్లోక రామాయణ పారాయణం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. 24వేల శ్లోకాలతో ఉన్న వాల్మీకి రామాయణాన్ని వెయ్యి శ్లోకాలుగా తయారు చేయించి ఆ గ్రంథాన్ని మొదటిగా భధ్రాచలం క్షేత్రంలో పారాయణం చేసినట్లు బృంద ప్రతినిధి శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు తెలిపారు. అనంతరం శ్రీరంగం, శ్రీకూర్మం, సింహాచలం, పద్మనాభం వంటి దివ్య క్షేత్రాల్లో పారాయణం చేసినట్లు వివరించారు. ఈ మేరకు రామతీర్థంలో 108వ సహస్ర శ్లోక రామాయణ పారాయణం చేసి పట్టాభిషేకం జరిపించామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


