ప్రమాద స్థలంలో విచారణ | - | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థలంలో విచారణ

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

రవాణా శాఖ ఉపకమిషనర్‌ పరిశీలన

పూసపాటిరేగ: మండలంలోని పూసపాటిరేగ పెట్రోల్‌ బంకు సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంపై విజయనగరం రవాణా శాఖ ఉపకమిషనర్‌ మణికుమార్‌ మంగళవారం విచారణ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పలువురు తెలియజేశారు. పెట్రోల్‌ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన విశాఖపట్నానికి చెందిన కరుణాకరన్‌ శ్రీనివాసరావు(57),బొబ్బిలి మండలం జోగిపేటకు చెందిన కళ్లంపూడి సింహాచలం(50), శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గంగుపేటకు చెందిన సదనపల్లి రాము, అదే గ్రామానికి చెందిన సదనపల్లి ఈశ్వరరావు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వ్యక్తికి విజయనగరం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మితిమీరన వేగమే ప్రమాదానికి కారణం

పూసపాటిరేగ పెట్రోల్‌ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో కారు మితిమీరిన వేగంతో వెళ్లూ అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. భోగాపురం మండలం రాజాపులోవ జంక్షన్‌ నుంచి పూసపాటిరేగ మండలం కందివలస వరకు రాత్రి వేళల్లో జాతీయ రహదారిపైనే నో పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలు నిలుపుదల చేయడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాదిగా జరిగిన ప్రమాదాల్లో ఎక్కువగా ఆగి ఉన్న లారీలను ఢీకొన్న సంఘటనల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement