● కంటెంజెంట్ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారావు
విజయనగరం ఫోర్ట్: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 3 సంవత్సరాల పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలని కంటిజెంట్ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.దుర్గారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. హెచ్‌ఆర్ సెల్‌ను వెంటనే ఏర్పాటు చేసి, కేంద్ర గైడ్‌లైన్స్ ప్రకారం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. యూపీహెచ్‌సీ స్టాఫ్ నర్సులకు గతంలో లాగానే 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలన్నారు. క్లియర్ వేకెన్సీ, పరస్పర బదిలీలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, రేషనలైజేషన్ పేరుతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు నష్టం కలిగించే నిర్ణయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కళావతి, జిల్లా కార్యదర్శి గౌరీశ్వరి, బి. శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.


