వీరఘట్టంలో డీజిల్ నో–స్టాక్
తెలిసిన వారికి ముందురోజు రాత్రే క్యాన్లలో డీజిల్ అడ్డుగోలుగా ఇచ్చేసిన బంకుల యాజమాన్యం
పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో క్యాన్లలో స్టాక్ చేసుకుంటున్న కొందరు వ్యక్తులు
వీరఘట్టం/పాలకొండరూరల్:
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత వీరఘట్టం మండలాన్ని సోమవారం తాకింది.బంకుల వద్ద డీజిల్ నో–స్టాక్ బోర్డులు పెట్టడంతో డీజిల్‌తో నడుపుతున్న ఆటోలు, పలువురు వాహనదారులు అవస్థలు పడ్డారు. అయితే డీజిల్ నిల్వలు ఆదివారానికి ఉన్నప్పటికీ వీరఘట్టంలోని బంకుల యాజమాన్యం రాత్రికి రాత్రే తమకు తెలిసిన వారందరికీ క్యాన్లలో పట్టేసి ఇచ్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్ పెట్రోల్ బంకు వద్ద పలువురు ఆటో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. స్టాకు ఉంచుకునే ఎందుకు మీరు ఇవ్వడం లేదని అక్కడి సిబ్బందిని నిలదీశారు. అనంతరం రెవెన్యూ డీటీ ప్రసాదరావు, ఎస్సై షణ్ముఖరావు బంకు వద్దకు వచ్చి స్టాకు వివరాలను పరిశీలించారు. మంగళవారం నాటికి పూర్తి స్థాయిలో డీజిల్ ఉంటుందని వాహనదారులకు నచ్చజెప్పారు. వాహనాలు తీసుకువచ్చేవారికి మాత్రమే పెట్రోల్ గాని, డీజిల్ గాని ఇవ్వాలని క్యాన్లకు ఇంధనం ఇవ్వవద్దని బంకు సిబ్బందికి సూచించారు. అయితే డీజిల్ కొరత వల్ల చాలా ఆటోలు స్టాండ్లకు మాత్రమే పరిమితమయ్యాయి.


