పీజీఆర్‌ఎస్‌కు 181 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 181 అర్జీలు

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

విజయనగరం అర్బన్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎల్‌) మరియు రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 181 వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కార్యక్రమంలో మొత్తం 181 వినతులు అందగా, అందులో అత్యధికంగా 69 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వాటిలో డీఆర్‌డీఏ–17, పంచాయతీరాజ్‌–16, విద్యుత్‌శాఖ–7, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ–4, గ్రామ సచివాలయ శాఖకు 4, విద్యాశాఖకు 3, మున్సిపల్‌, హౌసింగ్‌ శాఖలకు చెరో రెండు, ఇతర శాఖలకు 56 అర్జీలు నమోదయ్యాయి. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ వినతుల పరిష్కారంలో ఆలస్యం అసలు సహించబోమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పెండింగ్‌ వినతులను వెంటనే పరిష్కరించి డిస్పోజ్‌ చేయాలని ఆధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌ వినతులను ఆన్‌లైన్‌లో నిరంతరం పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలని అధికారులకు సూచించారు. అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తరువాతే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌.సత్తి బాబు, స్పెష్‌ల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అర్జీలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి

పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలకు స్పీకింగ్‌ ఆర్డర్‌లో స్పష్టమైన ఎండార్స్‌మెంట్‌ ఉండాలని సరైన సమాధానం ఇవ్వని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. అర్జీలపై తోచిన విధంగా రాయకుండా అర్జీదారుతో తప్పనిసరిగా మాట్లాడి సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఓస్‌ సమీక్షలో భాగంగా వినతుల పరిష్కారం, రీ–సర్వే, వాట్సాప్‌ గవర్నెన్స్‌, స్వీయ గణన, ఫ్యామిలీ సర్వే, సచివాలయాల తనిఖీ తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు.

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం

విజయనగరం క్రైమ్‌: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో 36 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్‌, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి:

వైఎస్సార్‌సీపీ నేతల వినతి

విజయనగరం: జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కలెక్టరేట్‌ లో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్లె రవికుమార్‌, ఇప్పిలి అనంత్‌ మాట్లాడుతూ వేతన బకాయిలు వల్ల రోజువారీ కూలీపై ఆధారపడ్డ వేతనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని కోరారు. అదేవిదంగా అధికారంలో ఉన్న నేతలు గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు నకిలీ మస్తర్లు వేసి, పనులు చేపట్టకుండా వారిని తమ రాజకీయ కార్యక్రమాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నకిలీ మస్తర్ల పై తగు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే పని అడిగిన వేతనదారులకి సకాలంలో పని కల్పించాలని సూచించారు. తమ వినతిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, వేతన బకాయిలు కోసం ప్రభుత్వానికి మరోమారు నివేదించనున్నట్లు కలెక్టర్‌ చెప్పినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement