దేవర మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

దేవర మహోత్సవం

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

శోభాయమానం.. దేవర మహోత్సవం

ఉత్సవరథంపై ఊరేగి.. పురవీధుల్లో ప్రజలను ఆశీర్వదిస్తూ.. హుకుంపేటలో ఘటాలకు పసుపు, కుంకుమలతో అభిషేకాలు నేటి నుంచి చదురుగుడిలో పైడితల్లి అమ్మవారు దర్శనం

శోభాయమానం..

విజయనగరం టౌన్‌:

సిరులతల్లి.. పైడితల్లి దేవర మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకెళ్లే ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడి స్తపన మందిరంలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ వేదపండితులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ఈఓ కె.శిరీష నేతృత్వంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ జై పైడిమాంబ .. జైజై పైడిమాంబ నామస్మరణతో మూడుసార్లు ప్రదక్షణ చేశారు. అనంతరం ఉత్సవ రథంపై అమ్మవారిని ఆశీనులు చేసి హారతులిచ్చారు. భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయ ధ్వానాలతో అమ్మరథం కదిలింది. రైల్వేస్టేషన్‌ వద్ద నుంచి ప్రారంభమైన రథం.. గాడీఖానా, సీఎంఆర్‌ కూడలి, వైఎస్‌ఆర్‌ సర్కిల్‌, ఎన్‌సీఎస్‌, కన్యకపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మున్సిపల్‌ ఆఫీస్‌, కమ్మవీధి, తెలకలవీధి రామమందిరం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. అక్కడ చదురు వద్ద ఉత్సవ విగ్రహాన్ని, పూజారి ఇంటివద్ద ఇత్తడి ఘటాలను ఉంచి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు ఘటాలతో ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, సాముగరిడీ, పులివేషధారణలు, కోలాటం, కాళికామాత వేషధారణలు, పెద్దపెద్ద బొమ్మల ప్రదర్శన, డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను ఊరేగింపుగా మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకెళ్లారు. అక్కడ ఘటాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆలయ తలయారి రామవరపు చినపైడిరాజు బృందం జంగిడి మీద దీపం పెట్టుకుని, చదురుగుడి నుంచి డప్పు వాయిద్యాలతో మంగళవీధి మీదుగా చెరువులోకి వెళ్లి అమ్మవారి మనవి చెప్పారు. అక్కడి మట్టిని పసుపు, కుంకుమగా మార్చి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా మంగళవీధి నుంచి గంటస్తంభం మీదుగా తిరిగి చదురుగుడికి అమ్మవారిని తీసుకువచ్చి ఆశీనులు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి సిరిమానోత్సవంలో జరిగే ఉయ్యాల కంబాల మహోత్సవం వరకు అమ్మవారు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement