● జేఈ యశ్వంత్ కుమార్ రెడ్డి
పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి దరఖాస్తుకు సంపూర్ణ పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ సమావేశంలో ఎస్‌డీసీ దిలీప్ కల్యాణ్ చక్రవర్తి, డీఆర్‌ఓ కె.హేమలతతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీ దారుల నుంచి 56 వినతులను జేసీ స్వీకరించారు. కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్‌కు 39, రెవెన్యూ క్లినిక్‌కు 17 అర్జీలు వచ్చాయి. పెండింగ్ సమస్యలను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు జేసీ సూచించారు. ఫీల్డ్ పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. అర్జీ దారులతో సానుభూతితో వ్యవహరించాలని హితవు పలికారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలి
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, వేధింపులు, ఆన్‌న్‌లైన్ మోసాలు వంటి అంశాలపై బాధితులు ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుల పూర్వాపరాలను విచారించి చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 15 వినతులు
సీతంపేట: ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశంలో ఏపీఓ చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 15 వినతులు వచ్చాయి. మర్రిపాడుకు చెందిన పాత్రో మినీ ట్రాక్టర్ మంజూరు చేయాలని అర్జీ అందజేశాడు. సర్వే చేసి కొండపోడు పట్టాలు ఇప్పించాలని వెంకటాపురానికి చెందిన గిరిజనులు వినతి ఇచ్చారు. అలాగే తాగునీటి బోరు గ్రామానికి వేయాలని, తాగునీటి బోరుకు మోటార్ వేయించాలని తుప్పలగూడ గ్రామస్తుడు రజినీకుమార్ కోరారు. భూ సమస్య పరిష్కరించాలని దొండమానుగూడ గ్రామస్తుడు సరవ కృష్ణారావు విన్నవించాడు. పవర్ వీడర్లు ఇప్పించాలని వెంకటాపురం, జంతూరు, బెండకాయలపేట తదితర గ్రామాలకు చెందిన లక్ష్మమ్మ తదితరులు కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ నారాయుడు తదితరులు పాల్గొన్నారు.


