చీపురుపల్లి: పట్టణంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైల్లో ఖైదీలకు ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే సబ్ జైల్లో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఖైదీల పట్ల గౌరవంగా మెలగాలని సూచించారు. ఖైదీలకు న్యాయస్థానం కల్పించిన న్యాయ సేవ హక్కులను వివరించారు. ఖైదీల పట్ల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సబ్ జైల్లోనే లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను పరిశీలించారు.
కామన్‌వెల్త్ వేదికపై
మెరిసిన భార్గవి
● యూత్‌లో గోల్డ్, జూనియర్‌లో సిల్వర్ మెడల్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ మరోసారి జిల్లాకు గర్వకారణమైంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఓషియానియా ఖండంలో ఉన్న సమోవాలో జరుగుతున్న యూత్ అండ్‌్ జూనియర్ కామన్‌వెల్త్ వెయిట్‌లిప్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీల్లో భార్గవి యూత్ విభాగంలో బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో వెండి పతకం అందుకుంది. స్నాచ్‌లో 78 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 102 కిలోలు ఎత్తి మొత్తం 180 కిలోలతో మెరుగైన స్కోరు నమోదు చేసింది. కఠినమైన పోటీని ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడి ఈ విజయాలను అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. తండ్రి బెల్లాన శ్రీనివాసరావు, తల్లి గౌరి ప్రేరణతో ఈ విజయాన్ని సాధించినట్లు భార్గవి తెలిపింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణికి జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, సీనియర్ కోచ్‌లు చల్లా రాము, వల్లూరి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
విశాఖలో జామి నివాసి ఆత్మహత్య
ఆనందపురం (విశాఖ): విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన సారిపిల్లి వినోద్ (27) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్లువాడ వద్ద నిర్మిస్తున్న గూగుల్ డేటా సెంటర్ పనుల కోసం వినోద్ ఇక్కడికి వచ్చారు. అయితే తీవ్రమైన అప్పుల బాధతో సతమతమవుతున్న వినోద్ మనస్తాపానికి గురై తర్లువాడ సమీపంలోని ఒక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరణించే ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి, తన భార్యాపిల్ల లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ స్టేషన్ పరిధిలోని బొగ్గులదిబ్బకు చెందిన తెరండి గోవింద(46) ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గోవింద్‌కు 15 ఏళ్ల క్రితం సంతోషికుమారితో పెళ్లయ్యింది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒకబాబు ఉన్నాడు. అయితే వ్యసనాలకు బానిసైన గోవింద్ తరచూ ఇంటికి వస్తూ గొడవ పడేవాడు. ఈ బాధ భరించలేకే భార్య సంతోషికుమారి కొడుకును తీసుకుని కన్నవారింటికి వెళ్లిపోయింది. ఘోషాఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న గోవింద్ మృతదేహమై కనిపించాడు.భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ అంజిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


