కాదంటే కారాగారమే..? | - | Sakshi
Sakshi News home page

కాదంటే కారాగారమే..?

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

సాలూరు: వివాదాస్పద ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ కరువైంది. ఇటీవల చేపట్టిన జనగణన సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రక్రియ కొటియా గ్రామాల్లోని ఇద్దరి గిరిజనుల అరెస్టుకు కారణమైంది. కొటియా గ్రామాల గిరిజనులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొటియా గ్రూపు గ్రామాల్లో ఒకటైన ఎగువశెంబి గ్రామంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఒడిశా అధికారులు పర్యటించారు. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకోవాలని వారికి సూచించారు. దీనికి గిరిజనులు స్పందిస్తూ తాము ఆంధ్రాలో ఉంటామని, ఇక్కడే సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకుంటామని గ్రామానికి చెందిన తాడంగి పిళ్లు, తాడంగి చిరంజీవి తదితరులు చెప్పారు. దీనికి గ్రామస్తులంతా ఒక్కటై ఒడిశా చేపడుతున్న సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ను తిరస్కరించడంతో అధికారులు వెనుదిరిగారు. సంబంధిత అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలతో ఒడిశాలోని కొటియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు శనివారం సాయంత్రం పిళ్లు, చిరంజీవిని తోణాం సమీపంలో అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొరాపుట్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో బాధిత కుటుంబాలు, గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆంధ్రాలో ఉంటామని చెప్పడమే చేసిన నేరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు గిరిజన సంఘాలు, సీపీఎం తదితర ప్రజా సంఘాల నాయకులు గిరిజనుల అక్రమ అరెస్టులను ఖండించారు. చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

స్పందించిన జేసీ

గిరిజనుల అరెస్టు విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పందించారు. జేసీ ఆదేశాలతో తహసీల్దార్‌ సురేష్‌ ఎగువశెంబి గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో, స్థానికులతో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వంలో... కొటియాలో గిరిజనులకు రక్షణ కరువు

ఇద్దరు గిరిజనులను అరెస్ట్‌ చేసిన ఒడిశా పోలీసులు

జనగణనను కాదన్నందుకే...

చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement