పార్వతీపురం రూరల్: రాబోయే దేశ వ్యాప్త జనగణన ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు పార్వతీపురంలో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పరుగును ప్రారంభించి, స్వయంగా పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ పరుగు పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగుతూ కలెక్టరేట్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జనగణన కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదని, అది దేశ సౌధానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. పౌరులు అందించే కచ్చితమైన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందుతాయని వివరించారు. ప్రతి ఇంటికీ గణన ప్రాముఖ్యతను చేరవేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. పౌరులంతా బాధ్యతాయుతంగా గణన అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ డి.పావని, డీఈఓ పి.బ్రహ్మజీరావు, వివిధ శాఖల అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


