● భగ్గుమంటున్న ఎండలు
● ఉక్కపోతతో అంగన్‌వాడీ చిన్నారులు విలవిల
● గొడుగు నీడలో ఇంటికి పయనం
ముఖ్యంగా నీడలోనే పిల్లలు ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురైతే వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా ఆస్పత్రుల్లో లభించే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను మాత్రమే అందించాలి. డబ్బా ఓఆర్‌ఎస్‌లను పట్టరాదు. అవి పడితే యూరిన్ మరింత అధికమై ప్రమాదకరంగా మారుతుంది. వైద్యులను సంప్రదించి తగు చికిత్స అందించాలి.
– బంకురు అప్పలనాయుడు,
చిన్నపిల్లల వైద్యనిపుణుడు, సాలూరు
గత ప్రభుత్వాలు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు 15 రోజులు సెలవులను మే 1వ తేదీ నుంచి అమలు చేసేవి. ఆ మేరకు ఏపీ అంగన్‌వాడీవర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మే నెలంతా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం గరిష్టంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– ఎన్.వై.నాయుడు,
సీఐటీయూ జిల్లా కార్యదర్శి,సాలూరు
పార్వతీపురం రూరల్/సాలూరు: భానుడి భగభగలు అంగన్‌వాడీ చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. కొన్నిచోట్ల వేడిని తట్టుకోలేక డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. జిల్లాలో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్‌లు కూడా లేకపోవడం చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో ఒకే గదిలో ఒకవైపు అంగన్‌వాడీ సామగ్రి, మరోవైపు వంటా వార్పు సాగుతుండటంతో వేడి మరింత రెట్టింపవుతోంది. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పురిపాకలు, రేకుల షెడ్లలోనే కేంద్రాలు నడుస్తుండడంతో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
ఎండలో ‘గొడుగు’ ప్రయాణం
మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రం విడిచిపెట్టే సమయానికి సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఆ తీవ్రమైన ఎండలో చిన్నారులు ఇళ్లకు చేరుకోవడం ప్రాణాంతకంగా మారుతోంది. కలెక్టర్ సూచనల మేరకు చిన్నారులను గొడుగుల నీడలో ఇంటికి సాగనంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,496 ప్రధాన, 163 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం అద్దె భవనాలే దికై ్కనచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది.


