● స్వీయ గణనకు ఈ నెల 30 వరకు అవకాశం
పార్వతీపురం: జిల్లాలోని 15 మండలాలు, మూడు మున్సిపాల్టీల్లో మే 1వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,744మంది ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. ఇందులో భాగంగా స్వీయ గణనను ఏప్రిల్ 16నుంచి 30 తేదీ వరకు ప్రతీ ఒక్కరు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ఎస్‌ఈ.సెన్‌సెస్.జీఓవీ.ఇన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. దేశ జనగణన చరిత్రలో తొలిసారిగా స్వీయగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)కు అవకాశం కల్పించారన్నారు. ఈ అవకా శాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేత్ర వైద్య సేవలపై నిశిత పర్యవేక్షణ
పార్వతీపురం రూరల్: జిల్లాలో నేత్ర వైద్య సేవల తీరుతెన్నులపై జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అంధత్వ నివారణ సంయుక్త సంచాలకులు డాక్టర్ సునీల్‌కుమార్ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా అధికారి డాక్టర్ సూర్యకౌశిక్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సేవలందిస్తున్న స్వచ్ఛంద కంటి ఆస్పత్రుల ప్రతినిధులతో వైద్య శిబిరాల నిర్వహణ, శస్త్రచికిత్సల నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమ పోర్టల్‌లో నెలవారీ నివేదికలు, ఫాలో–అప్ వివరాలను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయాలని సూచించారు. కేటరాక్ట్ శస్త్రచికిత్సల నమోదులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. సేవలలో పారదర్శకత, నమోదులో కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో పుష్పగిరి, శంకర్ ఫౌండేషన్, జెమ్స్, మిమ్స్, అనిల్ నీరుకొండ ఆస్పత్రుల ప్రతినిధులు, జిల్లా ఆస్పత్రి వైద్యులు కృష్ణారావు పాల్గొన్నారు.
రీ సర్వేను వేగవంతం చేయాలి
పార్వతీపురం: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీఆర్వోలు, మండల, గ్రామ సర్వేయర్లతో రీసర్వే పురోగతిపై శనివారం సమీక్షించారు. దశలవారీగా సర్వే నిర్వహిస్తూ ఈకేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. డ్రాప్ట్ దశకు ముందే అవసరమైన సవరణలు పూర్తిచేయాలని సూచించారు. 95 శాతం ఈకేవైసీ లక్ష్యం సాధించాలన్నారు. ప్రతి వీఆర్వో రోజుకు కనీసం 50 ఖాతాలు పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ వెర్ఫికేషన్‌లో ఫొటోలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా సేకరించాలని తెలిపారు. జిరాయితీ ఖాతాల ఆమోదాన్ని ఆర్డీఓ స్థాయికి అప్పగించడంతో ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మరణించిన వారి ఖాతాలను వారసులకు బదిలీ విషయంలో స్పష్టతతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మలేరియా రోగులు సత్వర చికిత్స తీసుకోవాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధి సోకిన వారు సకాలంలో చికిత్సతీసుకోవాలని డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి అన్నారు. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్మూలనకోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. జిల్లా మలేరియా అధికారి సింహాచలం, డీఎల్‌ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


