సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో ఏం జరుగుతోంది? ఎవరికి వారు పై చేయి సాధించడానికి.. పంతాలకు పోయి, పరిపాలనను గాలికి వదిలేశారన్న విమర్శలు గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్‌చార్జి పీవోగా ఉన్న యశ్వంత్ కుమార్ రెడ్డి.. ఇంకా ఆ పోస్టు నుంచి రిలీవ్ కాలేదు. కొన్ని ఫైళ్లు, బిల్లులు క్లియర్ చేసేందుకే ఆయన బాధ్యతలు అట్టిపెట్టుకుని ఉన్నట్టు సమాచారం. ఇక్కడి పీవోగా నియమితులైన సబ్ కలెక్టర్ వైశాలి.. బాధ్యతలు స్వీకరించలేదు. ఆమె ఇక్కడే కూతవేటు దూరంలోని కార్యాలయంలో ఉన్నా బాధ్యతలు స్వీకరించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చి వారం గడుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్క చేయలేని పరిస్థితి ఇక్కడ ఉంది. వాస్తవంగా వైశాలికి పీవోగా ఉద్యో గోన్నతి కల్పించారు. నిర్ణీత కాలంలో బాధ్యతలు స్వీకరించకపోతే శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉందని అధికారిక సమాచారం.
● మరోవైపు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా.. గిరిజన సంక్షేమ శాఖ డీడీగా ఉన్న విజయశాంతిని ఒంటరిని చేసే ప్రక్రియ సాగుతోందని ఆ విభాగ సిబ్బంది అంటున్నారు. మొదటి నుంచి ఆమె పట్ల అయిష్టంగా ఉన్న కొంతమంది.. నిర్ణయాల్లో ‘అధికారం’ ఇవ్వడం లేదని.. డీడీకి సంబంధం లేకుండానే.. ఈ శాఖపై పరిజ్ఞానం లేని కొంతమంది ఉద్యోగులను కొద్దిరోజుల కిందట ఆకస్మాత్తుగా ఇక్కడికి బదిలీ చేశారని ప్రచారం నడుస్తోంది. కొన్ని నిర్ణయాల్లో కీలకంగా, అప్రమత్తంగా ఉండాల్సిన గిరిజన సంక్షేమ విభాగంలో అటువంటి వారిని విధుల్లోకి తీసుకోవడానికి డీడీ అయిష్టత చూపుతున్నారు. ఈ నెపంతో డీడీకి మెమో, చార్జిమోమోను ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్ రెడ్డి జారీచేశారు. ఈ ప్రచ్ఛన్నయుద్ధం నేపథ్యంలో డీడీని సరెండర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
● మొత్తంగా ఏటీడబ్ల్యూఓలు, మరో విభాగ అధికారి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి కార్యాలయాల్లో రాజకీయాలకు కారణమవుతున్నారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.
● తప్పు చేసిన వార్డెన్లకు రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలోనే అశ్లీల నృత్యాలు చేయించి.. సస్పెండ్ అయిన వార్డెన్‌ను రెండు నెలల్లోనే రీవోక్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే బంధువు కావడమే కారణమని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి.
వారమైనా రిలీవ్ కాని పీవో
బాధ్యతలు స్వీకరించని సబ్‌కలెక్టర్ వైశాలి
తప్పుచేసిన వార్డెన్‌పై కఠిన చర్యలేవీ?
డీడీని సరెండర్ చేసే యోచనలో
ఇన్‌చార్జి పీవో?


