పార్వతీపురం: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పారదర్శకంగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో వాటి వివరాలను వెల్లడించారు. 2002 రోల్స్ డేటాను 2025 డేటాతో బీఎల్‌ఓల యాప్‌లో మ్యాపింగ్ చేస్తూ 68.53 శాతం పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది జనవరి 6 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16,799 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. వాటిలో 273 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం–6 కింద 7,437 దరఖాస్తుల్లో 6,358 కొత్త ఓటర్లు చేరారన్నారు. ఫారం–7 కింద 2,046 ఓట్లు తొలగించగా, నాలుగు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం–8 కింద 6,934 సవరణలు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు.


