నీడా లేదు.. నీరూ ఉండదు! | - | Sakshi
Sakshi News home page

నీడా లేదు.. నీరూ ఉండదు!

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

నీడా లేదు.. నీరూ ఉండదు! చెట్ల నీడలో..

సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పాలకొండ రూరల్‌/పార్వతీపురం రూరల్‌: జిల్లాలో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఆపసోపాలు పడుతున్నారు. ఓ వైపు ఎండలు.. మరోవైపు ఫేస్‌ యాప్‌ కష్టాలు.. వారికి పరీక్ష పెడుతున్నాయి. వేతనదారులకు పని దొరకడం.. గిట్టుబాటు వేతనం దక్కడం సంగతి పక్కనపెడితే.. అసలు రోజంతా ఎండల్లో నిరీక్షణకే సరిపోతోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 451 పంచాయతీలు ఉన్నాయి. 2.11 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా.. ఇందులో సుమారు 1.90 లక్షల కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. 3.80 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ఏప్రిల్‌లో 1.70 లక్షల మందికి పనుల లక్ష్యం కాగా.. సగం మంది కూడా నమోదు కావడం లేదు. ఎంఎంఎస్‌(మొబైల్‌ మానిటరింగు సిస్టం) యాప్‌లో సాంకేతిక ఇబ్బందుల వల్ల సగం మందికిపైగా పనికి దూరం అవుతున్నారు. ముఖ ఆధారిత హాజరు నమోదు వల్ల.. చాలా మందికి తీసుకోవడం లేదు. దీంతో వారికి మస్తర్లు పడడం లేదు. హాజరుకోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది.

టెంట్లు ఉండవు..

ప్రథమ చికిత్స కిట్లు కానరావు

ఎండల వల్ల ఉదయం 10 గంటలలోపు.. మరలా సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకూ పనులు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనలు క్షేత్రస్థాయిలో కాగితాలకే పరిమితం అవుతున్నాయి. పనిచేసే చోట కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వేతనదారులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా టెంట్లు, మజ్జిగ, తాగునీరు, ప్రథమ చికిత్స పెట్టెలు కానరావడం లేదు. గతంలో పనికి వచ్చే వేతనదారులకు పనిముట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు నెలల తరబడి వేతనాల బకాయి ఉంటోంది.

పార్వతీపురం మండలంలోని నర్సిపురం, అడ్డాపుశీల, చిన్నబొండపల్లి, కృష్ణపల్లి తదితర పంచాయతీల్లో పనులు చేస్తున్న వేతనదారులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. పని విరామ సమయంలో సేదతీరడానికి కనీసం టెంట్లు కూడా ఎక్కడా లేవు. గట్ల మీద, చెట్ల నీడలో ఆశ్రయం పొందుతున్నారు. మండుతున్న ఎండకు తాళలేక, వడదెబ్బకు గురవుతామని భయపడుతూనే వారు పనులను కొనసాగిస్తున్నారు.

పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనుల్లో వేతనదారులకు నీడకోసం టెంట్లు లేవు. దాహార్తిని తీర్చేందుకు నీరు, మజ్జిగ సదుపాయం కల్పన లేదు. ప్రథమ చికిత్స కోసం మెడికల్‌ కిట్లు ఊసేలేదు. వేతనదారులంతా నీడ కోసం సమీప గట్టు వద్ద ఉన్న చెట్లను ఆశ్రయించడం కనిపించింది. గతంలో గునపం, పార వంటి పనిముట్లు ఇచ్చేవారని.. ఇప్పుడు అవి కూడా లేవని వేతనదారులు వాపోతున్నారు. ఫేస్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు అదనం. కొన్నిసార్లు ఫేస్‌ యాప్‌లో నమోదు కాకపోవడం వల్ల పనికి వచ్చినా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోందని వేతనదారులు వాపోతున్నారు.

ఉపాధి పనికి వసతుల లేమి..

ఓవైపు ‘యాస్‌’సోపాలు.. మరోవైపు ఎండలతో ఇక్కట్లు

పని చేసే చోట కానరాని టెంట్లు, మజ్జిగ

ఉపాధి వడదెబ్బ

రోజులో అధిక సమయం నిరీక్షణే..

Advertisement
 
Advertisement
Advertisement