జియ్యమ్మ వలస రూరల్: రాష్ట్రంలో అరాచకం, అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనీపాటాలేని ముగ్గురు మహిళా మంత్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై కారు కూతలు కూడయడంపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయమని జనం ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలంగడిపేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిపేరుతో భూదందాలు చేసి అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని, ఆ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని ప్రశ్నించినందుకు మహిళా మంత్రులతో కారుకూతలు కూయిస్తున్నారని, వీరి వాగుడు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. మంత్రులు మీడియా ముందు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోవన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు కుంభకోణం, హనీ ట్రాప్‌చేసిన సవిత వేదాలను వళ్లించడం హాస్యాస్పదమన్నారు. జగన్‌మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వైఎస్సార్‌సీపీ గొడ్డలి పార్టీ అయితే మీ సైకిల్‌లో ‘కిల్’ఉంది కదా.. మీది కిల్ (హత్యలు)పార్టీయా అని విమర్శించారు. గిరిజన చిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడంలో మంత్రి సంధ్యారాణి హస్తం ఉందని ఆరోపించారు. అన్నం ఉడకలేదనే కారణంతో ఐదుగురు కేజీబీవి సిబ్బందిని తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేయడం గిరిజన సంక్షేమ మంత్రికి తగదన్నారు. కురుపాం నియోజకవర్గంలో విద్యార్థుల విషయంలో తప్పులు చేసిన వారిపై నాలుగు నెలలో సస్పెన్షన్లు ఎత్తి వేయడం, ఎమ్మెల్యే చుట్టమని క్రమశిక్షణ రాహిత్యంగా పనిచేసిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ ఎత్తివేయడం, ఏకలవ్య గురుకుల పాఠశాలలో శిక్షణ పేరుతో రూ.10 కోట్లు దోచుకోవడం ఇవన్నీ అబద్ధాలా ? అని మండిపడ్డారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఐ విల్ లెర్నింగ్ సొల్యూషన్‌న్స్ కంపెనీ వారు ఎటువంటి తరగతులు నిర్వహించకుండా రూ.5 కోట్లు స్కామ్ చేయడం అబద్ధమా? నిజమా అన్నది మంత్రి చెప్పాలన్నారు. అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా అబద్ధాలు చెబుతూ కాలంగడిపేస్తున్న నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.శెశికళ, ఎంపీపీ శెట్టి పద్మావతి, బంకురు శంకరజోగినాయుడు, బలగ వెంకటరమణ, నారాయణరావు, మురళి, కృష్ణ, రమణమ్మ, ఉషారాణి, ఈశ్వరరావు, మన్మథరావు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే..
అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని విస్మరించి డైవర్షన్ పాలిటిక్స్‌కు ప్రాధాన్యం
మంత్రుల తీరును విమర్శించిన పుష్పశ్రీవాణి


