బూజు దులపండి | - | Sakshi
Sakshi News home page

బూజు దులపండి

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

పాలకొండ: తహసీల్దార్‌ కార్యాలయంలో ఎక్కడిపడితే అక్కడే చెత్త ఉంది.. నిర్వహణ తీరు బాగులేదు.. గోడలకు ఉన్న బూజును వెంటనే దులపండి.. కార్యాలయం శుభ్రం చేసిన ఫొటోలను పంపించాలంటూ కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పాలకొండ డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటరావును ఆదేశించారు. సీతంపేట పర్యటనకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పాలకొండ తహసీల్దార్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవలపై ఆరా తీశారు. అర్జీలు వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్‌ రాధాకృష్ణను ఆదేశించారు.

పకడ్బందీగా గురుకుల ప్రవేశ పరీక్షలు

కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ ప్రవేశ పరీక్షలు శుక్రవారం జిల్లాలో పారదర్శకంగా జరిగాయి. పార్వతీపురం మండలం వెంకంపేట, విద్యానగర్‌లోని సురేష్‌ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్‌ దీపాలు, గాలి వంటి మౌలిక వసతులను పర్యవేక్షించారు. నిబంధనల మేరకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో పరీక్షా కేంద్రాల ఇన్‌చార్జ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

అంధ విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని అంధ విద్యార్థులకు ఉచితంగా బ్రెయిలీ పాఠ్యపుస్తకాలను సరఫరా చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.దేవరాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ మరియు ఎన్జీఓ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు (ఓపీడీఏఎస్సీఏసీ.ఏపీ.జీవోవీ.ఇన్‌) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలని, అర్హులైన ప్రతి విద్యార్థికీ త్వరలోనే పుస్తకాలు అందజేస్తామని వివరించారు. జిల్లాలోని అంధ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు.

32 మందిపై విరిగిన లాఠీ

విజయనగరం క్రైమ్‌: ఇటీవల విజయనగరం పట్టణంలో జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్‌ మృతదేహం తీసుకెళ్లే సమయంలో అలజడి సృష్టించిన 32 మందిపై ఎస్పీ దామోదర్‌ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం లాఠీ ఝుళిపించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాన్ని తీసుకెళ్లే సమయంలో ఆర్‌అండ్‌బీ నుంచి బాలాజీ కూడలి వరకు ర్యాలీగా హడావిడి చేయడం, బాణసంచా కాల్చడం, రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడం నగరంలో చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు మృతదేహాన్ని తరలించే సమయంలో అలజడి సృష్టించిన వారిని పోలీసులు గుర్తించారు. విజయనగరం వన్‌టౌన్‌, టు టౌన్‌ పోలీసులు జొన్నగుడ్డి, లంకాపట్నం తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 32 మందిని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఎదుట శుక్రవారం హాజరుపర్చారు. తొలుత వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో దురుసుగా ఉన్నవారిపై లాఠీలు ఝుళిపించారు. ఇకపై నగరంలో ఎలాంటి అల్లర్లు, విధ్వంసకాండ సృష్టించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అందరి వివరాలను నమోదు చేసి విడిచిపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement