గంజాయి నియంత్రణలో ఐవీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి నియంత్రణలో ఐవీఆర్‌ఎస్‌

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

పార్వతీపురం: జిల్లాలో గంజాయి నియంత్రణలో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టే ప్రజా స్పందనలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖతోపాటు సమన్వయ శాఖలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత, బాల్య వివాహాల నిర్మూలన కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, 500మీటర్ల పరిధిలో మత్తు పదార్ధాల విక్రయాలను అరికట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించి, బ్లాక్‌ స్పాట్‌ వద్ద హెచ్చరిక బోర్డులు, త్రీడీ పెయింటింగ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్మెట్‌ వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, కల్యాణ మంటపాల యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ నియంత్రణకు పోలీస్‌ శాఖ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వి.మనీషారెడ్డి, సబ్‌కలెక్టర్‌ ఆర్‌. వైశాలితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement